అవీ, ఇవీ, అన్నీ
అంగదుడి రాజ్యం స్థాపించడానికి మార్గం సుగమం చేస్తున్నారు.
ఇంక తనేమో, నలుడూ, నీలుడూ, గవయుడూ, గవాక్షుడూ మొదలైన తన తోటి వానరులని దేశం మీదకి తోలాడు--2014 లోగానీ, అంతకు ముందేగానీ యెన్నికలొస్తే, యే నియోజక వర్గంలో యెవరికి టిక్కెట్ ఇస్తే మంచిది? యెవరికి యెక్కువ గెలిచే అవకాశాలున్నాయి? వగైరాలు సర్వే చేసి, తనకి నివేదిక ఇమ్మని.
ఇంక మన రాష్ట్రంలోని వాళ్ల సామంతులు, ఈ సారి నెగ్గాలంటే మాత్రం, "గజన్" మీద కేసులన్నీ యెత్తేసి, ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాడి పార్టీని విలీనం చేస్తాడు అనీ, అదొక్కటే బ్రతుకు తెరువు అనీ మొత్తుకుంటున్నారట! మర్కటాలకీ, గోలాంగూలులకీ అయినా సిగ్గూ యెగ్గూ వుంటుందేమోగానీ వీళ్లకి........?!
మొన్న రామోజీరావు ఆయనెవరో "బొక్లీసు" అనే ఆయన్ని తీసుకొచ్చి, "అర్థ క్రాంతి" పేరుతో హడావిడి చేశాడు. తీరా ఆయన ప్రతిపాదనలన్నీ కొత్త సీసాలో పాత సారాయే! పైగా ఒక్కటీ ఆచరణ సాధ్యం కాదు. మరి అందరూ ఆయన్ని ఆకాశానికి యెత్తేశారు. నేనైతే అసలు ఆయన ఆలోచనలతో యేకీభవించను.
ఆయన చెప్పింది--డీ మోనెటైజేషన్--50 రూపాయలపైన ఉన్న నోట్లన్నీ రద్దు చేసేయ్యాలిట. కారణం--పేదవాళ్లకి ఆ నోట్లతో పని లేదట--బలిసినవాళ్లకి తప్ప!
మీరు బజారులో దుకాణాలదగ్గర గమనించండి--యెంతపేదవాడైనా, 500 నోటే మారుస్తున్నాడు. మరి ఇలా పెద్దవిలువ వున్న నోట్లని ఒక్కసారిగా రద్దు చేస్తే, ఆర్థిక వ్యవస్త అల్లకల్లోలమైపోదూ? ఇప్పటి బ్యాంకులు రద్దీని తట్టుకో గలవా?
ఈ విషయంలో, క్రమపధ్ధతిలో నోట్లని యెలా రద్దుచెయ్యాలో నేనిదివరకే వ్రాసిన టపాలు చదవండి.
ఇంక, లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరిగేలా చెయ్యాలట! ఇదీ ఆచరణసాధ్యం కాదు. యెందుకంటే, ఇప్పుడు నగదు లావాదేవీలు జరుగుతున్నది ముఖ్యంగా "ఆదాయ పన్ను" నుంచి తప్పించుకోడానికే.
బీ జే పీ వారు అప్పట్లో ఆదాయ పన్ను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. (తరవాత సంకీర్ణం పేరు చెప్పి, దాన్ని పట్టించుకోలేదు). నిజంగా ఆ పన్ను శాఖవారు చిరుద్యోగుల మీద తడాఖా చూపిస్తారుగానీ, తిమింగలాల్ని వదిలేస్తారు. ఆ పన్ను రద్దు చేస్తే, ప్రభుత్వానికి తగ్గే ఆదాయం చాలా స్వల్పం. వుద్యోగులు, చిన్న వ్యాపారులూ వగైరాలు చాలా సంతోషిస్తారు.
విదేశాల్లో దొంగడబ్బు దాచుకున్నవాళ్లని, దానిమీద కొంత ఆదాయపు పన్ను కట్టేస్తే, మిగిలినది తెల్లధనం అయిపోతుందంటున్నారు సర్కారువారు. ఆ పన్ను రద్దు చేసి, అక్కడి నిధులని జప్తు చెయ్యగలిగితే, దేశం బాగుపడుతుoది.
ఇంక, బ్యాంకు లావాదేవీల మీద బి టీ టీ వసూలు చేస్తే చాలట--మిగిలిన పన్నులని రద్దుచేసి!
ఇప్పటికే, సేవల పన్ను పేర బోళ్లు గుంజుతున్నారు. దానిమీద విద్యా సెస్సూ, ఇంకాదానిమీద వున్నతవిద్యా సెస్సూ లాగించి, అనేక సేవలకి దాన్ని విస్తరించి, అనాయసంగా కోట్లు దండుకుంటున్నారు. ఆ సెస్సులు ఇప్పటివరకూ యెంత వసూలు అయ్యాయో, విద్యావ్యస్థకి యెంత ఖర్చుపెట్టారో--బ్రహ్మదేవుడిక్కూడా తెలీదు. ఇక బీ టీ టీ కూడా విధిస్తే? మరిన్ని వందలకోట్లు.
నగదు లావాదేవీలని రూ.2,000/- కి పరిమితం చెయ్యాలట! ఓ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ కిరాణా సరుకులు, బియ్యం కొనుక్కుంటే, కనీసం రూ.3,000/- దాటుతోంది. దానికి చెక్కు ఇస్తామంటే యే వ్యాపారస్థుడు ఇస్తాడు? "మీ దగ్గర వున్నప్పుడే ఇవ్వండి" అంటారు గానీ!
సరే! వాళ్లంతా మేథావులు! మనలాంటి "మేతావులు" కాదు.
కేంద్రం నవరత్న కంపెనీలని ప్రైవేటుకి అమ్మేసి, డబ్బు చేసుకోవాలని చూస్తూంటే, మార్కెట్లో ఆ వాటాలు కొనడానికి యెవరూ ముందుకు రావడం లేడట. అందుకని, పాపాల భైరవుళ్లాంటి ఎల్ ఐ సీ వాళ్లకి అంటకడుతున్నారట. దానికోసం, ఆ సంస్థ యే కంపెనీలోనైనా, 30 శాతం వరకూ వాటాలు కొనుగోలు చెయ్యడానికి అవకాశం కల్పించారట!
ఆ సంస్థకూడా నాశనం అయిపోతే, విదేశీ బీమా సంస్థలకి పండగే పండగ!
కొందరికి పళ్లు సరిగా లేవు. మరి కొందరికి పాదాలు సరిగ్గా లేవు. ఇంకొందరికి యెత్తు తక్కువ, ఛాతీ కొలతలు సరిపోవు!
యెవరికనుకుంటున్నారు? రెండేళ్ల క్రితం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా, వైద్య పరీక్షలూ వగైరాలు చేయించి, 162 మందిని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు గా నియమించేశారట. ఇప్పుడెవరో, నిబంధనలకి విరుధ్ధంగా వాళ్లకి వుద్యోగాలిచ్చారని దర్యాప్తు చేయించాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ని కోరారట--ఆ వుద్యోగాలు రానివాళ్లు. ఇంకేముందీ? తాజాగా 162 మందికీ వైద్య పరీక్షలు చేయిస్తే, అందులో 62 మంది పైన చెప్పిన కారణాలవల్ల అనర్హులు అని తేలిందట! ఇప్పుడు వాళ్లని తొలగించడం యెలా? అంటూ మొత్తుకుంటున్నారట సంబంధిత అధికారులు.
అసలు ఆ ఇన్స్పెక్టర్లు, పళ్లతోనూ, పాదాలతోనూ, ఛాతీ తోనూ యేమైనా పని చేస్తారా? యేమిటో యెందుకో ఆ నిబంధనలు!
యెక్సైజు కానిస్టేబుళ్ల నియామకంకోసం పరుగు పోటీలో, మొన్న 10వ తారీకున ఓ అభ్యర్థి "నాలుగు కిలోమీటర్లని, 20 నిమిషాల్లో" పరుగెత్తడానికి సిధ్ధపడి, రెండు కిలోమీటర్లు పరిగెత్తి, కుప్పకూలి మరణించాడట--కడప లో!
అసలు అలాంటి పరీక్షలు అవసరమా? ఆ నిబంధన పెట్టినవాడు రౌరవాది నరకాల్లో దేంట్లోకి పోతాడో కదా!