అవీ, ఇవీ, అన్నీ
జర్మనీ మంత్రి మన ప్రణబ్ కి ఎల్జీటీ బ్యాంకులో భారతీయుల ఖాతాలకి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి తమకు యే అభ్యంతరం లేదు అనీ, యెలాంటి సమాచారాన్నైనా అందించగలమనీ హామీ ఇచ్చారట. ప్రణబ్ ఆయన్ని "అభినందించారట". మరి సమాచారం యెప్పుడు అడుగుతారో?
ఇంకా, ఇతర దేశాల్లో, పన్ను ఎగవేత (టాక్స్ ఇవేజన్), పన్ను మోసం (టాక్స్ ఫ్రాడ్) ల మధ్య తేడా వుందట! యెగవేత నేరం కాదట! యెగవెయ్యడం మోసం కాదట! ఈ వ్యత్యాసం తొలగించడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోందట. దీనిమీద ఆథారపడే వొప్పందాలు వుంటాయట. మరి అన్ని దేశాలతోనూ, ముఖ్యంగా స్విస్, జర్మనీ లతో వొప్పందాలెప్పుడో?
లిబియా అధ్యక్షుడు (కర్నల్) మొవమ్మర్ గడ్డాఫీ దేశం వదలి పారిపోయాడంటున్నాయి పాశ్చాత్య దేశాలు. తాను దేశం లోనే వున్నాను అంటున్నాడు ఆయన. పాతిక పైగా హత్యా ప్రయత్నాలని తప్పించుకొన్న చిరంజీవి ఆయన. మరి యేమవుతుందో!
మా జిల్లాలో, ఈ మధ్య జిల్లా కలెక్టరుతోసహా, వున్నతాధికారులందరూ సంకల్పం చేసుకొని, "వైద్యనిధి" యేర్పాటు చేశారు. తమిళనాడులో ధర్మపురి జిల్లాలో ఇలాంటి "స్కీము" అమలవుతోందని తెలిసి, ఓ నలుగురు వైద్యుల బృందాన్ని 2010 సెప్టెంబరులో ఓ మూడు రోజుల పాటు అక్కడ పర్యటించి నివేదిక సమర్పించమని, దాని ప్రకారం ఇక్కడ స్థాపించారట.
అక్కడనించీ, ప్రభుత్వ (రెవెన్యూ) వుద్యోగులందరూ రెచ్చిపోయి, తమ జీతాల్లో కొంతభాగాన్ని ఈ నిధికి అర్పించి, పేపర్లలో ఫోటోలు వేయించుకొంటున్నారు. వున్నతాధికారులందరూ తలో 10 వేలూ అర్పించారట. వచ్చిన ఓ లక్షతో "బుట్టాయగూడెం" ప్రా ఆ కేం కి "భవనం" కట్టించేశారట. ప్రజలూ ముందుకు రావడంతో, మిగిలిన భవనాలన్నీ 12 లక్షలతో "ఆధునీకరించారట". 15 లక్షలతో ఆధునిక పరికరాలు కొన్నారట. అన్ని పరీక్షలూ, ఎక్స్ రేలూ, స్కాన్లూ అన్నీ వుచితం ట. అత్యాధునిక ఆపరేషన్ థియేటరు సిధ్ధమయ్యిందట. కేంద్రమంత్రి పళ్లం రాజు ఈ ఆసుపత్రిని ప్రారంభించారట.
ఇంకా, మండలంలోని 15 రెవెన్యూ గ్రామాల ప్రజలూ కుటుంబానికి రూ.20 చొప్పున ప్రతీనెలా 20 వేలు వచ్చేలా తీర్మానాలు చేసుకొని, దానితో రోగులకి భోజనాలూ, పళ్లూ, రొట్టెలూ, పాలూ వగైరా అందిస్తున్నారట. నిధి మొత్తం ఇప్పటికి రూ.44 లక్షలకి దాటిందట.
ఇన్నేళ్లుగా కలక్టర్లెవరూ ఇలాంటి "స్కీములు" యెప్పుడైనా వేశారా? ఓ సారి గుర్తు తెచ్చుకోండి!
పుబ్బలోపుట్టి, మఖలో మాడిపోయే ఈ స్కీములవల్ల వొరిగేదేమిటి? ఇలాంటి స్కీములు యెన్ని వేసి, యెన్ని కోట్ల కోట్లు ఖర్చుపెడితే, కనీసం అన్ని గిరిజన మండలాల్లోని పీ హెచ్ సీ లు బాగుపడతాయి?
పైగా, జిల్లా కలెక్టరుగారికి--పుట్టిన రోజు, పెళ్లిరోజు, పదోన్నతి వగైరాలకీ, జాతీయ పర్వదినాల్లోనూ శుభాకాంక్షలు చెప్పే వొరవడిని ప్రవేశపెట్టింది "ఈనాడు". దాంతో వుద్యోగులూ, ఇతరులూ కూడా ప్రకటనల రూపం లో "అవి" చెప్పేస్తున్నారు!
పాక్ లో అమెరికా జరిపిన పైలట్ రహిత యుధ్ధ విమాన క్షిపణి దాడుల్లో, నాలుగు క్షిపణులు ప్రయోగిస్తే, యేడుగురు వుగ్రవాదులు హతమయ్యారట. రెండుదేశాల సంబంధాల్లో 'ప్రతిష్టంభన' నెలకొందట.
అఫ్ఘాన్ లో ఓ మానబబాంబు పేలి, 31 మంది ప్రాణాలు కోల్పోయారట. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారట కూడా. ఇది తాలిబాన్ల పనేనట.
సోమాలియాలో మొగాడిషూ లో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, ఓ 'కారు ఆత్మాహుతి దళం' పేల్చుకోవడంతో 8 మంది పౌరులు మృతి చెందారట. కారు పూర్తిగా లోపలికి రాలేదు కాబట్టి సరిపోయిందట. వస్తే, స్కోరు ఇంక బాగా పెరిగేదట!
వుగ్రవాదానికి మతం లేదట!