Monday, September 28, 2009

ఆత్మ

ప్రయాణం

జీవి మరణించాడు అని ప్రకటించబడ్డాక కూడా, జీవుడు (ఆత్మ) శరీరాన్ని అంటిపెట్టుకొనే వుంటాడట.

శరీరం దహనం చెయ్యబడుతున్నా, ఆఖరివరకూ--కపాలమోక్షం అయ్యేవరకూ శరీరాన్నీ, ఆ తరవాత చితాభస్మాన్నీ అంటుకొనే వుంటాడట.

ఆస్తిసంచయనం జరిగి, అస్థినిమజ్జనం అయ్యాక, కర్మ చేసేవాళ్ళద్వారా, ఆత్మని మంత్రాలద్వారా ఒక శిలలోకి ఆవాహన చేస్తారు--అపరకర్మలు చేయించేవాళ్ళు.

అక్కణ్ణించీ ప్రతీరోజు, నిత్యవిధి చేస్తూ, 'ప్రేతాన్ని దహించడంవల్ల ఆత్మకి కలిగిన వేడి తగ్గడానికి ' అంటూ అనేకసార్లు మంత్రసహితంగా ఆ శిల మీద నీళ్ళు జల్లడమేకాదు, దాన్ని వుంచిన పిడతనిండా నీళ్ళు పోసి, క్రింద చిల్లుపెట్టి, దానిలోంచి ఓ త్రాడు క్రిందికి వేళ్ళాడేలాగ చేసి, ఆ పిడతని జీవుడు మరణించినచోట పైన గాలిలో వేళ్ళాడగడతారు--అందులోంచి చుక్క చుక్కగా కారి, ఆత్మ చల్లబడుతూ, మరణప్రదేశాన్ని కూడా చల్లబరుస్తుందని. కర్మ పూర్తయ్యేవరకూ, ఆపిడత ఖాళీ అవకుండా, అప్పుడప్పుడు నీళ్ళతో నింపమంటారు!

ఇలా పదమూడోరోజు పూర్తయ్యేసరికి ఆత్మ వైతరణిని కూడా దాటి, భువర్లోకానికి ప్రయాణం సాగిస్తుందిట.

అక్కడనించి ప్రయాణానికి లెక్కలు వున్నాయిట--మొదటి నెల ఆత్మకి 'ఒక రోజు ', ఇలా! మధ్యలో 'త్రైపక్షికం' కూడా పెడతారు--ఆ లెఖ్ఖల్లో భాగంగానే.

ఆ తరవాత నించి మనకో నెల అయితే, ఆత్మకి ఒకరోజు, మనకి 12 నెలలయ్యాక (సంవత్సరీక కర్మలు అయ్యాక), అక్కడనించీ మనకి ఓ సంవత్సరమైతే ఆత్మకి ఒక రోజు అనీ చెపుతారు!

చితా భస్మం పూర్తిగా నిమజ్జనం అయ్యేవరకూ--ఆత్మ ప్రయాణం మొదలుపెట్టదుట. (మొన్నామధ్య యేదో మ్యూజియం లో గాంధీగారి చితాభస్మం నిమజ్జనం కాకుండా ఓ పాత్రలో వుంచబడి కనిపించిందట! అందుకే ఇప్పటివరకూ ఆయన ఆత్మకి శాంతి లేదు, ఆయన మళ్ళీ జన్మ యెత్తలేదు--అనుకుంటా!)

ఇక భువర్లోకం లో యెన్నాళ్ళుండాలి--అక్కణ్ణించి ఆత్మ యేమి చేస్తుంది? అనేవాటికి ఇంకా లెఖ్ఖలు వున్నాయట.

అవి ఇంకోసారి!

Sunday, September 6, 2009

మరణం

ఆత్మ

ఆయన ఆత్మకి శాంతికలుగుగాక--అనివ్రాస్తుంటే, అనిపించింది--ఈ 'ఆత్మ ' గురించి కొంచెం వ్రాస్తే బాగుంటుందని.

'మంగేష్' లాంటివాళ్ళూ, వాళ్ళ మాస్టర్లూ--విషయాన్ని గజిబిజి చేసేసి, 'స్థూల శరీరం', 'సూక్ష్మ శరీరం'--సూక్ష్మ శరీరానికి మోక్షం--ఇలా బుర్రల్ని చెడగొట్టేస్తున్నారు!

మనిషి చనిపోయాక యేమి జరుగుతుంది?

యెవరూ చూసివచ్చి చెప్పింది లేదు--యెవరికి తోచినట్లు వాళ్ళు--వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ, ఉపనిషత్తులూ లాంటి వాటి మీదా, ప్రముఖుల ప్రవచనాలలోంచీ--గ్రహించగలినంత గ్రహించారు--తిరిగి కొంతమందికి చెప్పాలని ప్రయత్నిస్తూనే వున్నారు.

అసలు విషయం 'ద్రష్ట ' లైన మన మహామునులు 'గరుడపురాణం' లో చెప్పారు(ట).

మరణం (కాలధర్మం) గురించి 'ఈనాడు ' 06-09-2009 న 'జీవన వేదం' శీర్షికన చక్కని సంపాదకీయం వ్రాశారు--తప్పక పూర్తిగా చదవండి! దీనిలో.....

'.....--జనం తరఫున ఆడే ఆట ముగించకుండానే మధ్యలో వదిలేసి ఎవరైనా అలా చిరునవ్వులు చిందించుకుంటూ పైలోకాలకు వెళ్ళిపోవటం మాత్రం కచ్చితం గా తొండే!' అన్నది హైలైట్!

ఇక ఆత్మ గురించి మరోసారి!


Thursday, September 3, 2009

మహాఘోరం

విధి విలాసం

సృష్టిలో జవాబులేని ప్రశ్న, ఒకవేళ జవాబు అని భావించదలుచుకుంటే 'విధి ' అని సమాధానం వచ్చే ప్రశ్న--"యెందుకు" అనేది.

సినీనటి సౌందర్య విమానం కూలిపోయి మరణించినప్పుడు, టివీలో--ఆమె అరుస్తూ, గాజు తలుపులమీద గుద్దుతూ, కాలిపోవడం చూసిన వాళ్ళందరూ--'అంతటి నిస్సహాయ మరణం పగవాళ్ళకి కూడా రాకూడదు భగవంతుడా!' అని తప్పకుండా అనుకొని వుంటారు.

మరి--ఆంధ్రరాష్ట్ర నాయకుడు శ్రీ రాజ శేఖర రెడ్డి--24 గంటలకి పైగా--యేమి అనుభవించాడో--యేదిక్కూలేని అనాథలా యెంతకాలం పడివున్నాడో--ఇదంతా యెందుకు? అంటే--జవాబులేని ప్రశ్న! అంతే!

మనిషి వున్నంతకాలం తెలీదు--కానీ--ఒకసారి 'లేడు ' అనుకోగానే--అక్కడ యెంత అగాథం యేర్పడుతుందో మనకి వాళ్ళ మీదున్న అభిమానాన్నిబట్టి తెలుస్తుంది!

ఆయన ఆత్మకి శాంతి కలుగుగాక!