‘పనిలో పని’
మా ఇంట్లో, ఆవకాయ పెట్టాలంటే, ఆవకాయ కత్తిపీట కోసం యెదురింటి గొల్ల నరిసిమ్మూర్తిని అడగవలసి వచ్చేది! (ఆ కత్తిపీట వాళ్ళకెలా వచ్చిందో నాకు తెలియదు!)
మా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి యెవరికైనా ఆ కత్తి పీటే దిక్కు! (మా చుట్టుపక్కల ఆవకాయ పెట్టుకొనే వాళ్ళు చాలా కొంత మందే!) అది చాలా కాలం గా అందరూ వాడడంవల్ల కొంచెం వంకరగా తరిగేది కూడా!
మా తాతగారి దగ్గరనించీ, చదువుచెప్పే ఇల్లు మాదొక్కటే కావడం, చుట్టుపక్కల వాళ్ళకెవరికీ చదువు రాకపోవడం తో, మాకొక ప్రత్యేకమైన గౌరవం వుండేది!
అలాంటి పరిస్థితుల్లో, ఓ యేడాది గొల్ల నరిసిమ్మూర్తి ని ‘రేపు ఆవకాయ కాయ తెప్పించు కొంటున్నాం! కత్తిపీట కావాలి’ అనడిగితే, ‘అటక మీద వుంది, రేపు పొద్దున్నే దింపిస్తాను’ అని చెప్పాడు!
తరవాతేమయిందో, వాళ్ళాడవాళ్ళు యేమి పుల్ల వేశారోగాని, మర్నాడు పొద్దున్నే మా నాన్నగారు తోటకి వెళ్ళి, కాయ దింపించి ఇంటికి చేరాక, నేను వెళ్ళి కత్తిపీట అడిగితే, నరిసిమ్మూర్తి ‘యెవరో పట్టుకెళ్ళారంటండి’ అన్నాడు!
అప్పటికి, మా నాన్న పాపం మామూలు కత్తిపీటతోనే తంటాలు పడవలసి వచ్చింది!
తరవాత, మా అమ్మ ప్రోద్బలం మీద, ఓ నెల మొదటివారం లో, మా నాన్న ఓ వడ్రం-కం-కమ్మర మేస్త్రీ తో మాట్లాడి, చక్కటి పెద్ద సైజు మామూలు కత్తి పీటా, ఆవకాయ కత్తిపీటా తయారు చేసి ఇచ్చేలా, ముప్ఫై రూపాయలకి ఒప్పించారు!
ఓ వారం లో రెండు కత్తిపీటలూ మా ఇంటికి చేరాయి. శుభం!
అంతే అయితే బాగుండేది—ఈ బ్లాగు అవసరం వుండేది కాదు!
ఆ నెల మూడో వారం లో మా అమ్మగారికి యెదో ఓ అయిదు రూపాయల అత్యవసరం వచ్చింది! మా నాన్న ‘నా దగ్గర లేవు’ అన్నారు! అంతే! మా అమ్మ ‘అనవసరంగా 30 రూపాయలు తగలేశారు—రెండు కత్తిపీటల కోసం! మన మామూలు కత్తిపీట బాగానే వుందిగా? అది మానేస్తే, 15 రూపాయలు మిగిలేవిగా?’ అంటూ క్రొశ్నించింది విసుగ్గా!
మా నాన్న ‘హాసినీ గోలగూల! (ఆయన మా అమ్మని తిట్టగలిగిన పెద్ద తిట్టు!) నువ్వేకదూ పనిలో పనిగా చేయించుకోకపోతే వస్తువులెలా అమరుతాయి? అని నన్ను చంపుకు తినేదానివి?’ అన్నారు!
‘పిల్లికీ బియ్యానికీ ఒకటే మంత్రమా?’ అంది మా అమ్మ!
చెప్పొచ్చేదేమిటంటే, ఆ వారసత్వం ఊరికే పోదు కదా? నాకూ వచ్చింది!
యే వస్తువు కొన్నా, ‘కనీసం రెండు’ కొంటాను!
మా ఆవిడ అంటుంది ‘ఇంకోటి యెందుకండీ! దండగ! ఇప్పుడప్పుడే దాని అవసరం రాదు కదా’ అని. ‘పోనీలే! పడి వుంటాయి’ అని నా సమాధానం!
షాపులవాళ్ళు కూడా, నన్ను చూడగానే, యెలాగా రెండు అడుగుతానని తెలిసి, ‘సార్! ఇవి మూడూ వంద రూపాయలండి! మూడూ తీసుకోండి!’ అనగానే, ‘సరే ఇచ్చెయ్యి’ అంటాను నేను!
ఇలాంటి వాటిలో చెప్పుకోదగ్గవి షేవింగ్ క్రీములూ, చెప్పులూ లాంటివి! చిన్నదానికీ, పెద్దదానికీ ఖరీదు లో యెంతో తేడా లేదని, పెద్ద సైజువే రెండు షేవింగ్ క్రీము ట్యూబులు కొనేస్తాను! మొదటిది యెప్పటికి అయ్యేను? రెండోది యెప్పుడు ఉపయోగించేను!
అలాగే బయట వాడే చెప్పులు కొనడానికి వెళ్ళి, ‘పనిలో పనిగా’ ఇంట్లో వాడడానికి హవాయి చెప్పుల జత కూడా కొనుక్కు వస్తాను! హవాయి చెప్పులు తెగిపోతే, వాటితో పాటు, బయటి చెప్పులుకూడా కొనేస్తాను!
మా ఆవిడ, చిట్కాలూ, నజరానాలు చక్కగా అనుసరిస్తూ వుంటుంది—‘ఆరునెలలుగా మీరు వాడని వస్తువులని ‘చెత్తగా’ భావించి ఒదిలించుకోకపోతే, మీ ఇల్లు ఓ చెత్తకుండీ గా మారి పోతుంది’ అని యెక్కడో చదివిందట!
ఓ ఫైన్ మార్నింగ్ ‘యేమండీ! ఈ షేవింగ్ క్రీములూ, బ్లేళ్ళూ, సాక్సూ, జోళ్ళూ, రెయిన్ కోట్లూ, జర్కిన్లూ----‘అంటూ లిస్టు చదివి, ‘పనికి రానివేగా?’ అంటుంది!
ప్రతీ సంవత్సరం, సంక్రాంతి రోజుల్లో వచ్చే ఓ అనాథ శరణాలయం వాళ్ళకే అవన్నీ ప్రాప్తం!
అదీ ఓ సద్వినియోగమే కదా!
కానీ, మా ఆవిడ యే వస్తువు తెచ్చినా ‘ఇప్పుడెందుకండీ’ అనే నస భరించడానికి అలవాటు పడిపోయాను మరి!
కొసమెరుపు : యే కూరగాయలకో పొద్దున్నే బయలుదేరుతున్న మా అల్లుడితో మా అమ్మాయి యేం తేవాలో చెప్పి, ఆఖర్లో, ‘కన్నాడికి మేంగో బైట్ తీసుకురండి’ అంటూంటే, మా రెండేళ్ళ మనవడు అనే వాడు ‘నాన్నా! ఓ రెండు మూడు తీసుకురా! ఆకలేసినప్పుడల్లా తింటా!’ అనేవాడు!
మరి ‘జీన్సా! మజాకా?’