Sunday, July 20, 2008

ద్రవ్యోల్బణం

అనగానగా అప్పుడెప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం డిల్లీలో రాజ్యమేలుతుండగా, ద్రవ్యోల్బణం రెండంకెలలో వుండేదట! అప్పుడు విత్తమంత్రి శ్రీ మన్మోహన్ సింగు గారూ, వాణిజ్య మంత్రి శ్రీ చిదంబరం గారూ, ప్రణాళికా సంఘానికో దేనికో, మాంటేక్ సింగ్ అహ్లువాలియా గారూ .........వుండేవారట!

మళ్ళీ ఇప్పుడు వారు ముగ్గురి హయాంలోనే ద్రవ్యోల్బణం 12 శాతానికి దగ్గర్లో వుంది!
30 ఏళ్ళ క్రితం ప్రజలు మరిచిపోయిన "ప్రత్యేక తెలంగాణ" మళ్ళీ 2004 యెన్నికల ముందు ప్రత్యక్షమయింది!
ప్రజలు ఎప్పుడో చూసిన మతకలహాలు మళ్ళీ కనిపిస్తున్నాయి!
ఈ దరిద్రాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు ప్రత్యక్షం అవుతాయి?
అలాగే, అయోధ్య అంశాన్ని ప్రధానిగా దేవె గౌడ పార్లమెంటులొ ప్రస్తావించే వరకూ అందరూ మరిచి పోయారు!

మధ్యలో అప్పుడప్పుడూ నేను బతికే వున్నానంటూ, వీపీసింగు గారు వెనుకబడిన వర్గాలకి రిజర్వేషనులు అంటూ కందిరీగల తుట్టె మీద ఓ రాయి వేస్తూ వుంటారు.

వెంటనే, అర్జున్ సింగ్ గారు ఓ చిన్న బిల్లు తయారు చెసేస్తూ వుంటారు!
చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే శివరాజ్ పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ లాంటివాళ్ళు!
పీవీ నరసిం హారావు నుంచి సూట్కేసులు అందుకున్నందుకు శిక్ష పడిన, మళ్ళీ ఎంపీలైన వాళ్ళు, మళ్ళీ సూట్కేసులకీ, మంత్రి పదవులకీ సిద్ధం!

న్యాయస్థానాలచే తప్పుపట్టబడిన వాళ్ళు, కీలక రాజ్యాంగ పదవుల్లో!
ద్రవ్యోల్బణానికీ, మార్కెట్లకీ సంబంధించిన విషయాల్లో మాత్రం 'మూడు కోతుల ' సూత్రాన్ని పాటించే రిజర్వ్ బాంక్ గవర్నర్!

వీళ్ళందరికీ ఓ చేటపెయ్య--సోనియా గాంధీ!

ఇవన్నీ చూస్తుంటే 'బిషప్ హ్యాటో' చేసిన పని గుర్తు రావడంలేదూ?
వాడు ముష్టి వాళ్ళని చేసినట్టు ఈ గాంగునందరినీ ఎవరైనా చేస్తే సంతోషించే వాళ్ళలొ మొదటివాణ్ణి నేనే!

Thursday, July 17, 2008


గడ్డి తినే బుధ్ధి



చారిత్రాత్మక తప్పిదాలు చెయ్యడంలో ఆరితేరిన C.P.I (M) పార్టీకి చెందిన శ్రీ ఇంద్రజిత్ గుప్తా గారు లోక్ సభ స్పీకరుగా యెన్నికయ్యాక, ఇక ఏ పార్టీకి చెందినవారు కారట. వారి పార్టీ రాజీనామా చెయ్యమంటే అది చెల్లదట. ఆయన అసలు బాధంతా రేపు పార్టీ విప్ ప్రకారం ప్రభుత్వం ప్రవేశ పెట్టే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలనేనట! సరే, ఒప్పుకుందాం!


మరి B.J.P తో 'కలిసి ' ఎలా ఓటు చేస్తాను అంటాడేమిటి? మిగిలిన పార్టీల గొడవ నీకెందుకయ్యా? నీ పార్టీ పెద్దలు ఎలా చెపితే అలా వింటావా? లేక నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అన్నదే పాయింటు. అంతేగాని, ఇవేమి వంకలు? మీ పార్టీ బుఱ్ఱ గొరిగించుకోమంటే, బుధ్ధిగా గొరిగించుకుంటావా? ఫలానా పార్టీ వాడు బుఱ్ఱ గొరిగించుకుంటాడుట. వాడితో 'కలిసి ' నేను ఎలా గొరిగించుకుంటాను అంటావా!


ఇది భలే బాగుందయ్యా!


రేపు విశ్వాస తీర్మానం మీద ఓటింగులో రెండువైపులా సమంగా వస్తే, అప్పుడు? నీ నిర్ణయాత్మక (deciding) ఓటు ఏం చేస్తావు? ప్రభుత్వానికి ఓటు వేసి, 'అంతరాత్మ ప్రబోధం ప్రకారం వేసేనంటావా?' లేక "ఫలానా పార్టీ అనుకూలంగా వేసింది. దాంతో 'కలిసి ' ఎలా వేస్తాను?" అంటావా?


అసలు నీకు మళ్ళీ ఎన్నీకల్లో పోటీ చేసే చాన్స్ వస్తుందంటావా? వస్తే మీ మాజీ పార్టీ నుంచా? లేక కాంగ్రెస్ నుంచా? లేకపొతే ఏకంగా రాష్ట్రపతి ఛాన్స్ కొట్టెయ్యచ్చు అని కలగంటున్నావా? ఎవరి చెవుల్లో పువ్వులు పెడదామనుకుంటున్నావూ?


తేల్చి చెబితే బాగుంటుంది! మరెప్పుడు చెబుతావు?


సామాన్యుడు ఎదురు చూస్తూన్నాడు మరి!

Tuesday, July 15, 2008

"కప్పల తక్కెడ"



మళ్ళీ భారత పార్లమెంటు కప్పల తక్కెడ అయిపోయింది! 'అణు ఒప్పందం' వ్యతిరేకిస్తూ లెఫ్ట్ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఉపసం హరించడంతో పార్లమెంటులో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మేకపొతు గాంభీర్యాన్ని ప్రదర్సిస్తూనే మరో పక్క బుట్టలో కట్టలు పెట్టుకొని, చిన్న పార్టీల సభ్యుల వెనకాల తన చాణక్య మంత్రుల్ని తోలి, కట్టల్ని తీసుకొని బుట్టలో పడండి అని బతిమాలమంటోంది(ట)! బుట్టల్లోని కట్టల విలువ 35 కోట్లట!
మరి కప్పల తక్కెడ కాకేమవుతుంది?

రేప్పొద్దున్న పార్లమెంటులో బలం సరిపొతే, అలాంటి వాళ్ళకి మంత్రి పదవులిస్తే (కట్టలే కాకుండా, బుట్టలో పడడానికి అవి కూడా ఇస్తామని చెప్పంటున్నారట) వాళ్ళు అనతి కాలంలో ఇంకెన్ని కోట్లు సంపాదిస్తారో!

మరి సామాన్యుణ్ణి ఆ భగవంతుడైనా రక్షిస్తాడో లేదో!