అవీ, ఇవీ, అన్నీ
"రావణాసురుడు ప్రజలకు న్యాయబధ్ధమైన పాలన అందించాడు. దోపిడీదారు కానే కాదు. రావణుడితోపాటు బలి చక్రవర్తి, నరకాసురుడు, శూర్పణఖ, తాటకి ల చరిత్రను తిరగరాసి, పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాల్లో చేర్చాలి" ప్రముఖుడైన ఓ ప్రొఫెసర్ గారు "మూలవాసీ రారాజు రావణ చక్రవర్తి" వర్ధంతి సభలో ఇలా చెప్పి, ఇంకా రాముడికంటే రావణుడు నీతిమంతమైన పాలన అందించాడు అనీ, ఆయన ఇతర రాజ్యాలపై దండయాత్రలు చెయ్యలేదు అనీ, మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు అనీ, రావణున్ని బ్రాహ్మణులూ, క్షత్రియులూ కలిసి హతమార్చారు అనీ కూడా చెప్పారట. ఇతిహాసాల్లో వున్నవన్నీ మక్కికి మక్కీ నిజాలుగా నమ్మేసి, అవన్నీ తిరగరాయాలనే ప్రొఫెసర్లు కూడా వుంటారా? అయినా క్షత్రియులూ, వానరులూ, భల్లూకులూ వగైరాలు రావణుణ్ణి చంపితే, మధ్యలో బ్రాహ్మణులెక్కడనించి వచ్చారో!
విశ్వనాథవారిని "భూస్వామ్య వ్యవస్థ అంతరిస్తున్నందుకు" బాధపడ్డారనీ, ఆ దశదాటి మరింత మెరుగైన దశకు సమాజ పయనం ఆయనకు నచ్చలేదు అనీ, మళ్లీ వెనక్కు వెళ్లాలన్నది ఆయన ఆలోచన అనీ, ఆయన 'మాస్టర్ రియలిస్ట్, బట్ ఎ రియాక్షనరీ ఫిలాసఫర్ ' అనీ, మంచైనా, చెడైనా సమాజం ముందుకే వెళుతుంది అన్న సత్యాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు అనీ, అదీ ఆయన తాత్విక దృక్పథం అనీ--వేయిపడగలు గురించి ప్రస్తావించి విమర్శించారింకో పెద్దాయన ఇంకో పత్రికలో.
నిజానికి విశ్వనాథ బాధపడింది రాచరికం అంతరిస్తోందనికాదు--దాంతోపాటు మన ప్రాచీన నాగరికతకీ, సంస్కృతికీ గ్రహణం పడుతోందనీ, అది అరాచకానికి దారితీస్తోందనీ చక్కగా వివరించడానికి ప్రయత్నించారు ఆ నవల్లో.
మరి ఆరోజుల్లోనే ఆయన మెట్టభూములన్నీ మాగాణాలుగా మారుస్తుంటే, పసిరిక లాంటి వాళ్లకి ఆవాసాలు కరువవుతున్నాయి అనీ, అనేక కీటకాదులు నశిస్తున్నాయనీ వ్రాశాడంటే, అప్పట్లోనే ఆయన, ఇప్పుడు మనం డప్పుకొట్టుకొంటున్న బయో డైవర్సిటీ, ఇకో బేలన్స్ ల గురించి యెంత బాధపడ్డాడో తెలియడంలేదూ?
ఇంకా కల్పవృక్షంలో గ్రాంధికం వ్రాసి వుండొచ్చు--అది అలాగే వ్రాయాలికాబట్టి. వేయిపడగల్లోది శిష్ట వ్యావహారికమంటారనుకొంటా. మాబాబు లాంటి ఇతర రచనల్లో పూర్తిగా వ్యావహారికభాషలోనే వ్రాశాడే?
ఆయన్ని రియాక్షనరీ అనొచ్చా?
"సింగినాదం......జీలకర్ర" గురించి ఇదివరకోసారి వ్రాశాను. మొన్న తెలుగు వెలుగులో సామెతలు కొన్ని యెగుమతి వ్యాపారం నుంచి పుట్టాయని వ్రాస్తూ ఈ ప్రసక్తి తెచ్చారు ఆ రచయిత.
జీలకర్రతో పడవలు జీలకర్రగూడెం, బుట్టాయగూడెం వగైరా చోట్లనుంచి నింపుకుని, గోదావరిలో ప్రయాణించి, డచ్చివారి యెగుమతి రేవైన మా నరసాపురం వచ్చేవి అనీ, వాటి రాక తెలియడానికి "శృంగనాదం" (కొమ్ము బూరా వూదడం) చేసేవారు అన్నంతవరకూ నిజమే. తరవాత్తరవాత, ఇంకే అటవీ వుత్పత్తితో పడవలు వచ్చినా, శృంగనాదం చెయ్యడం, జనాలు "అవిగో! జీలకర్ర పడవలు వచ్చేశాయి" అంటూండడం, కొందరు పెద్దలు "శృంగనాదానికీ, జీలకర్రకీ సంబంధం యేమిట్రా?" అంటూ నవ్వడంతో, ఈ సామెత పుట్టింది. అందుకే సంబందంలేని విషయాలు చెపుతుంటే, "ఆ! సింగినాదం జీలకర్రాను!" అని చప్పరించేస్తారు.
అదీ సంగతి.