Tuesday, October 11, 2011

(యమర్జెంటు) కబుర్లు - 78



.....అవే!

పిచ్చిదంబరం ఇదివరకోసారి "ఆ రెండుపార్టీలూ (కాంగీ; తెదేపా) తమ అభిప్రాయం చెప్పేవరకూ......." అన్నాడు. మొన్న మళ్లీ, "ఆ నాలుగుపార్టీలూ (ఎం ఐ ఎం నీ, వై యెస్ ఆర్ నీ కలిపాడు!).........." అన్నాడు. రేపు నేనో కొత్త పార్టీ పెడితే, "ఆ ఐదు పార్టీలూ......" అంటాడేమో! బాగానేవుంది.

ఆజాద్ యేదో నివేదిక ఇచ్చాడట! "మీనీ కోర్ కమిటీ" సంప్రదింపులు పూర్తి అయ్యాయట. "మెగా కోర్ కమిటీ" ఇంకా మాట్లాడుకోవాలట.

ఈలోపల, "సకలజనుల సమ్మె విరమింపచేసే బాధ్యత" కి కు రె కి అప్పజెప్పారట.

గవర్నరోడూ, ముక్కుమంత్రోడూ, చిరంజీవీ వగైరాలూ--రాష్ట్రపతి పాలనకి అవకాశమే లేదు--"శాంతీ, భద్రతా" భద్రంగానే వున్నాయి, (యెప్పుడో) యెన్నికకాబడిన, ప్రసిధ్ధమైన ప్రభుత్వం పనిచేస్తుంది--అని సెలవిచ్చేశారు!

ఇంకోప్రక్క, వుద్యోగులు--మేము సమ్మె చేసుకుంటాం, మాజీతాలు ఒకటో తారీక్కల్లా ఇచ్చేయాలి, పండుగ అడ్వాన్స్లు ఇవ్వాలి, మూడు నెలలజీతం ముందుగానే ఇచ్చెయ్యలి".....ఇలా మొదలెట్టారు.

ఆర్టీసీ వాళ్లేమో, కొన్ని వందల బస్సులు నడిపిస్తున్నాం అంటారు. వాళ్ల గుర్తింపు పొందిన సంఘం, అనేక "లాభకరమైన" హామీలని పొంది, సమ్మె విరమిస్తున్నాము అన్నారు. అదేదో "ఫోరాన్ని" రద్దు చేశాము అన్నారు.

మళ్లీ టీవీలనిండా, బస్సులు తిరగడంలేదు అని గోల! రైళ్ల సంగతి దేవుడికే యెరుక!

గద్దరోడు కార్మికులకి కొన్ని అడ్వాన్సులూగట్రా ఇప్పించాడు. మళ్లీ ప్రభుత్వం "థూచ్" అందట!

ఇంకో ప్రక్క, "తెలంగాణా + నెల్లూరు, అనంతపురం, చిత్తూరు - హైదరాబాదు" అనీ, "ఆంధ్ర + ఖమ్మం - శ్రీకాకుళం, విజయనగరం" అనీ, "రాయల - నెల్లూరు, అనంతపురం, చిత్తూరు + మహబూబ్ నగర్" అనీ, కోస్తాంధ్ర/సర్కార్లు - నెల్లూరు, చిత్తూరు, గుంటూరు" అనీ, ఇలా యెవడికితోచిన పిచ్చివాగుళ్లు వాళ్లు వాగేస్తున్నారు!

మరి పరిష్కారం యెలా?

'69; '73 లోల్లా పూర్తిస్థాయి సీ ఆర్ పీ ఎఫ్; మిలిటరీ దళాలు దిగాలి!

పిరికోళ్లు "పండుగుల సందర్భంగా విరామం; పరీక్షల సందర్భంగా విరామం; పంటచేతికొచ్చేదాకా విరామం......"ఇలా వుద్యమాన్ని, "అహింస ముసుగులో" యెగదొయ్యలేకపోతూంటే, అక్కడ కేంద్రం సంప్రదింపులమీద సంప్రదింపులకి పోతూంటే, "జనజీవనం" మాత్రమే అస్థవ్యస్థం అవుతోంది!

నాకైతే, యే ప్రభుత్వమూ లేకుండా, "అంధేరా ప్రదేశ్"లోనే, నివశిస్తే బాగుండును అనిపిస్తోంది! మన రాష్ట్ర బడ్జెట్ ఓ రెండేళ్లక్రితమే లక్ష కోట్లు దాటింది. ఇప్పుడు లక్షా ఇరవై వేల కోట్లో యెన్నో. మన రాష్ట్ర జనాభా ఓ ఫది కోట్లనుకుంటే, "తలకి" 12 వేలు వస్తుంది. {పావలా వడ్డీలూ, కిలోరూపాయి బియ్యాలూ (తెలుగుమాటేనండి....ఒరియాకాదు) అఖ్ఖర్లేదు}......ఒక్కొక్కరికీ పంచేస్తే, "ఓ రాష్ట్ర ప్రజలారా! మీకింకేవిధమైన పన్నులూ వుండవు. పైగా మీ ఖాతాలకి సంవత్సరానికి 12 వేలు బదిలీ చెయ్యబడుతుంది. ఇంకా కేంద్ర గ్రాంటులు వస్తే, మీకు బోనస్ కుడా గిట్టుబాటవుతుంది! (ప్రభుత్వం నడపడానికీ, ప్రాజెక్టులు వగైరాలకీ ప్రపంచ బ్యాంకు వుండనే వుంది!)" అని యే "కశెన్నగాడో" ప్రకటిస్తే, మనవోట్లన్నీ వాడికే వేశెయ్యమూ!?

భలే బహ్లే! మంచి పరిష్కారంకదూ????!!!!

వెధవలు వోటర్ల లిస్టులో నా పేరు చేర్చడంలేదుగానీ, చేరుస్తేనా, బృహన్నలలకి వోటెయ్యకుండా, ఇలాంటి హామీ ఇచ్చేవాళ్లనే యెన్నుకొనేలా చేసేవాణ్ని!

యేం చేస్త్రాం!

Wednesday, October 5, 2011

కబుర్లు - 77

అవీ, ఇవీ, అన్నీ

సకలజనుల సమ్మె చేసుకుంటున్నారు......తమ ప్రజలకి వ్యతిరేకంగా తామే! అని సంతోషిస్తున్నారా? రేపు యే పిచ్చిదంబరమో ఇంకో ప్రకటన చేసేవరకూ గాజులు తొడుక్కొని కూర్చుంటారా? ఇప్పుడే మీ సత్తా ప్రకటిస్తారా? తేల్చుకోండి! అంటున్నాడట కోడెల.

యేదీ, యెవడబ్బ సొమ్మూ కాదు! "ఈ దరిద్రం వదలాలంటే, వాడు అడిగిన తెలంగాణా ఇచ్చేస్తే పోను కదా......హైద్రాబాదు తప్ప"....అని సామాన్య జనాలు అంటున్నారంటే, యెంత విసిగిపోయారో ఓ సారి ఆలోచించండి!

కేసీఆర్ తన తోక తాను లేపలేకపోయినా, జానా రెడ్డి ని "తెలంగాణా వస్తే, ముఖ్యమంత్రివి నీవే" అని యెగదోసి, తెలంగాణా కాంగ్రెస్ మంత్రులనీ, ఎమ్మెల్యేలనీ, నాయకులనీ "వూతకర్రలుగా" చేసుకొని, తానో మహాత్ముడి స్టేజికి యెదగాలని వాడి స్ట్రేటజీ! దానికి పిల్లిగడ్డమోడొకడు మధ్యవర్తి! ఇప్పుడు, "తెలంగాణా ఇచ్చేస్తే, మా పార్టీని మీ పార్టీలో విలీనం చేసేస్తా"నంటాడా? "నీ విలీనం యెవడికి కావాలి--చిరంజీవి సపోర్టు మాకుండగా!" అని కాంగీవాళ్లంటూంటే, కొందరు మాత్రం, "బలేమామా బలే! అదే మన తక్షణ కర్తవ్యం" అంటున్నారు! ఇంకో ప్రక్క, కురువృధ్ధ జైపాల్ రెడ్డిని 'మీ నాయకత్వం అవసరం ' అంటున్నారు. మరి ఇంక బొర్రముక్కోడూ, మిడి గుడ్లోడూ, అంతమందిని బలిపెట్టి యేమి సాధించినట్టు?

మామూలుగా కాకపోతే, కుంచం తిరగేసి కొలవమన్నారు--అన్నాడు గిరీశం.

"ఆటునుంచి నరుక్కురమ్మన్నారు" అని కూడా అన్నాడు!

గాంధీ మార్గం ఫలితాన్నివ్వకపోతే, శివాజీ మార్గం ఆదర్శం అవుతుందన్నారు "అన్నా హజారే"! ఇప్పుడు అదే మార్గం పడుతున్నారేమో! "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా" అని చెప్పి, "వచ్చే యెన్నికల్లో కాంగీలకి వోటు వెయ్యొద్దు" అని ప్రచారం చెయ్యడానికి బయలుదేరుతానన్నాడు! దెబ్బకి దిమ్మతిరిగి, బొమ్మ గూట్లో పడింది......సల్మాన్ ఖుర్షీద్ అప్పుడే ప్రకటించేశాడు......"వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే "లోక్ పాల్" బిల్లుని ప్రవేశపెట్టి, ఆమోదింపచెయ్యడానికి ప్రయత్నిస్తాము" అని!

జై గాంధీ మార్గం! జై శివాజీ మార్గం! జై జై అన్నా హజారే!

సెన్సెక్స్ 16 వేలకన్నా క్రిందికి పడిపోయింది. ఇదివరకోసారి, 8 వేలకన్నా పడిపోతే సంతోషిస్తాను అని వ్రాశాను. యెందుకంటే, అది బలుపు కాదు వాపు అని ఖచ్చితంగా చెప్పాను. ఇప్పుడు నిజం అవుతోంది కదా? మూడీస్ ఎస్ బీ ఐ రేటింగుని తగ్గించేసింది. పిచ్చిదంబరం అనవసరంగా మార్కెట్లని వాచేలా చేసి, అదంతా బలుపు అనుకోమన్నాడు!

"నిరర్ధక ఆస్థుల" కాన్సెప్ట్ వచ్చినప్పటినుంచీ, యెలాగో అలా మేనేజి చేసి, (ఆడిటర్లకి ఆడీ కార్లు కొనిచ్చి) బ్యాంకులన్నీ తమకి నిరర్ధక ఆస్థులు దాదాపు లేవు అని ప్రకటించుకుంటూవస్తున్నాయి. ఇప్పుడు, మానవ ప్రమేయం లేకుండా, కంప్యూటర్లే ఈ ఆస్థుల నిర్ధారణ చేస్తున్నాయి. రేపు మార్చికి చూడాలి--ఈ బ్యాంకుల పరిస్థితి! యెన్నింటి గోడలూ, పునాదులూ చెదలు తినేశాయో!

ఇంకో ప్రక్క, "ఇంక కీలక రేట్లని పెంచొద్దు మహాప్రభో" అంటున్నారు పారిశ్రామిక వేత్తలు! దువ్వూరివారూ....ఆలకించకండి. మరోసారి వీళ్లకి పెద్ద యెత్తున షాక్ ఇవ్వండి! వృధ్ధి రేటు యేనెలకానెల జీరో అయినా, వృధ్ధి అంటూ జరక్కమానదు!

ప్రణొబ్ ముఖొర్జీ, తన కార్యాలయంలో దొంగ కెమేరాలు పెట్టించారు అని మొత్తుకొంటే, "దానితో వాడికి సంబంధం లేదు" అన్నారు. వాళ్ల శాఖ అప్పుడెప్పుడో వాడికి లేఖ వ్రాసింది అంటే, ఇప్పుడు "వాళ్లిద్దరూ ఫ్రెండ్స్!" అని షేక్ హేండులిప్పించేశారు! అసలు అది వాళ్ల మధ్య సమస్యా? మొత్తం దేశం సమస్యా?

ఇప్పుడు నెమ్మదిగా బయటకొస్తూంది......ఈ దరిద్రాలన్నింటికీ కారణం "అధిష్టానమే" అనీ, అక్కడ నేషనల్ ఎడ్వైజరీ కౌన్సిల్ పేర ఓ 17 మందితో "సూపర్ కేబినెట్" నడుస్తూంది అనీ, మంత్రులనీ, శాఖలనీ, పార్లమెంటులో బిల్లులనీ చదరంగంలో పావులని కదిపినట్టు ఆడిస్తోంది అనీ!

అరుణారాయ్ అనే ఆవిడ (తన సొంత లోక్ పాల్ బిల్ ఫేం) అందులో ముఖ్యురాలట. ఇంకా, హర్ష్ మందిర్ అనే మాజీ ఐయేఎస్ అధికారి ఓ సూపర్ కాప్ ట (బీజేపీని యెదుర్కొనే సత్తా వాడికే వుంది అని ఆవిడ నమ్మకంట)--ఆ కౌన్సిల్లో!

ఇంక రాజ్యాంగం యెందుకూ, మంత్రివర్గం యెందుకూ......అన్నీ కూడా యెందుకూ? పోనిద్దురూ!

Monday, October 3, 2011

కబుర్లు - 76

అవీ, ఇవీ, అన్నీ

ప్రణాళికా సంఘం వారేదో, పట్టణాల్లో "తలకి" 32 రూపాయలూ, పల్లెల్లో "తలకి" 26 రూపాయలూ--"రోజుకి" సంపాదించేవాళ్లందరూ "దారిద్ర్యరేఖకి" పైనున్నట్టే అని నిర్ధారించి, కోర్టువారికి చెపితే, భాజపావారు, మన్మోహన్ సింగ్ పేరనొకటీ, సోనియాగాంధీ పేరనొకటీ రూ.32/- చొప్పున రెండు డీడీలు తీసి పంపించి, "ఈడబ్బులతో మీరు ఒక రోజు బ్రతికి చూపించండి!" అని సవాలు విసిరారట! (పాపం వాళ్లా డీడీలు మార్చుకోడానికి కూడా భయపడి మానేశారట!)

యోగాగురు 'బారాందే' "నల్లధనానికి వ్యతిరేకంగా" వుద్యమించి, బొక్కబోర్లా పడ్డాడు. ఇంకా వుద్యమం కొనసాగుతోంది అని ప్రకటిస్తున్నాడు! దానికి బదులు, దేశంలోని భక్త ప్రజలనబడే వారందరికీ "భక్తిపేరుతో మీ వేలంవెర్రుల్ని తగ్గించుకోండిరాబాబూ!" అని ఒక్క పిలుపిస్తే, సంతోషించేవాళ్లలో మొదటివాడిని నేను. 

ఇంకా, నల్లధనాన్ని చాలావరకూ వెలికితీసే మార్గం నాకోటి తోచింది. అదేమిటంటే......గణపతి నవరాత్రులతో మొదలెట్టి, భారీ విగ్రహాలూ, భారీ లడ్డూలూ లాంటివే కాకుండా, కొత్తగా "కరెన్సీ" నోట్లతో అలంకరించడం అనే వెర్రి బాగా ముదురుతోంది! దసరా సందర్భంగా, పెద్ద పెద్ద అమ్మవారి గుళ్లేకాదు, వేంకటేశ్వర మొదలైన ఆలయాలేకాదు, పుంతలో ముసలమ్మదగ్గరనించీ, పెంటమీది పేరమ్మ వరకూ కనీసం పదో పదిహేనో లక్షలతో అలంకరిస్తున్నారు! 

ఈమధ్య కొన్నిచోట్ల యేకంగా కోట్లలోకి కూడా చేరింది! నిన్నెక్కడో ఒకచోట కోటీ పదకొండు లక్షల పదకొండు వేలతో, ఇంకో రెండుమూడు చోట్ల కోటికి పైగా,  అలంకరించారట! 

ఈ డబ్బు యే ఖాతాల్లోంచి వస్తోంది, యే బ్యాంకుల్లోంచి వస్తోంది, ఒకవేళ పాతనోట్లు ఇచ్చి, కొత్తనోట్లు గ మార్చుతున్నారంటే, యే బ్యాంకు అధికారులకి భక్తి యెక్కువై అలాంటి పనులు చేస్తున్నారో.....ఇలాంటి విషయాలు వెలికి తీస్తే సరి! చాలా కష్టం అంటారా! అఖ్ఖర్లేదు. ఇలాంటి వివరాలన్నీ స్థానిక పోలీసు ఐ డీ పార్టీ కానిస్టేబుళ్లు సేకరించి, పై అధికారులకి పంపిస్తూనే వుంటారు. వారినే ఇంకొన్ని వివరాలు సేకరించమంటే సరి! యెలా వుంది అవిడియా?

మొన్న ఓ రోజు, చిన్నతిరపతి లో ఓ పెద్దమనిషి, ఖద్దరు చొక్కా, ఖరీదైన కళ్లజోడూ వగైరాలతో "నేను హైదరాబాదులో పెద్ద వ్యాపారిని. ఇక్కడ ఓ కల్యాణమండపం కట్టించడానికి 30 లక్షలు విరాళం ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. ప్రస్తుతానికి, అన్నదాన పథకానికి గానూ ఓ లక్ష కి చెక్కు ఇస్తున్నాను" అనగానే, ఆలయ అధికారులు యెందుకైనా మంచిదని దేవస్థానం ఛైర్మన్ కి ఫోను చేసి మరీ....రాచమర్యాదలతో శ్రీవారి అంతరాలయ దర్శనంతోపాటు, పెద్దమొత్తంలో ప్రసాదాలూ వగైరాలన్నీ చదివించి, సాగనంపారట. ఆయన మళ్లీ ఓ పదిరోజుల్లో కల్యాణమండం గురించి మాట్లాడ్డానికొస్తానని చెప్పి మరీ వెళ్లాడట. 

తీరా బ్యాంకుకి వెళ్లి చూస్తే, చెక్కుజారీ చెయ్యబడిన ఖాతాలో రూ.16/- మాత్రమే వున్నాయి అనీ, అంతకు ముందుకూడా ఆ ఖాతాలో ఐదువేలకి పైబడి లావాదేవీలు జరగలేదనీ తేలి, మింగలేక, కక్కలేక అధికారులందరూ సతమతమయ్యారట! 

అవునుకదూ.....యెవరినైనా.....మెడలో కుక్కల గొలుసుల్లాంటివివేసుకొని, దానికి వేళ్లాడవలసిన "ఐడీ" కార్డులని చొక్కాజేబులో దాచుకొనే వాళ్లనైనా, అవి చూపించమని అడగడానికి మనవాళ్లకి అదేంటో....సిగ్గో, భయమో!

ప గో జి, కాళ్ల మండలం, పల్లిపాలెం గ్రామంలో, మొన్న ఓ యేడేళ్ల బాలుడు "విషపుటీగల" బారిన పడి మృతిచెందాడట. దాంతో, రెవెన్యూ అధికారులు, కొందరు గ్రామ సహాయకులతో (ఇంగ్లీషు సినిమాలు చూడడంలో నిపుణులేమో!) "ఆపరేషన్ రెస్క్యూ" నిర్వహించారట. 

ఆ వూరి రామాలయం గోపురంలో ఆ విషపుటీగల "తుట్టె" వుండడంతో, బ్రహ్మాండమైన ప్లాను వేసి, సిబ్బంది "ఫైర్ ప్రూఫ్" దుస్తులు ధరించి, ముందుగా గోపురానికి నాలుగుప్రక్కలా వున్న రంధ్రాలని బంకమట్టితో పూడ్చేశారట. 

తరవాత, ఇంకో రంధ్రంద్వారా, "మొనోక్రోటోఫాస్" పిచికారీ చేశారట. తరవాత, సిధ్ధంగా వుంచుకొన్న "పెట్రోలు" ఆ రంధ్రంగుండాపోసి, నిప్పంటించారట

ఇంకేముందీ! ఆపరేషన్ సక్సెస్, బట్ పేషంట్ డెడ్ అన్నట్టు, పెద్ద విస్ఫోటం సంభవించి, ఆ గోపుర శిఖరం విరిగిపడి, ఒకతనికి తీవ్రగాయాలవగానే క్రిందకు దూకేసి, మిగిలినవాళ్లకి కూడా గాయాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అధికారులతోపాటు.... "హమ్మయ్య! విషపుటీగలని సమూలంగా నిర్మూలించాం!" అని సంతోషిస్తున్నారట. 

ఇలాంటి "ఆపరేషన్" సరియైన భద్రతా చర్యలు లేకుండా, ప్లాను చేసినవాళ్లకీ, నిర్వహింపచేసినవాళ్లకీ మీరు యే యెవార్డు ఇప్పిస్తారు?