అవీ, ఇవీ, అన్నీ
ఓ ప్రక్క సభాసంఘాలూ అవీ అంటూ పిసుక్కుచస్తున్నట్టు నటిస్తూనే, సందట్లో సడేమియాగా వాళ్ల జీత భత్యాలు రెట్టింపు కన్నా యెక్కువచేసుకొంటూ ఓ బిల్లుని చప్పుడుకాకుండా ఆమోదించేసుకున్నారట మన శాసన సభ్యులు.
అంతే కాకుండా, ప్రభుత్వం వారు ఓ ల్యాప్ టాప్ నీ, ఇంకోళ్లెవరో టాబ్లెట్ పీసీ నీ, ఇలా లక్షల విలువ చేసే బహుమతులని కూడా చదివించారట వాళ్లకి!
వాళ్లవి యెంత లాభసాటి క్రీడలో కదా!
ఆథార్ గురించి తాజా వార్త--రాష్ట్రంలో 39 లక్షలమంది కార్డుకోసం నమోదు చేసుకొంటే, 13 లక్షలమందికే ఇవ్వగలిగారట ఇప్పటివరకూ! అథార్ కేంద్రాలకి జనాలు కుటుంబసమేతంగా యెగబడుతుంటే, వాళ్లు "ఓ స్త్రీ! రేపురా" అంటున్నారట. అందుకని దళారులు అవకాశాన్ని 'సొమ్ము' కూడా చేసుకొంటున్నారట!
ఇది పని కాదని, మళ్లీ నమోదుని "ఆన్ లైన్" చెయ్యడానికి సాఫ్ట్ వేర్ తయారు చేస్తున్నారట. జనాలు ముందు సమాచారమంతా నమోదుచేసుకొంటే, అప్పుడు వాళ్లు తేదీ ఖరారు చేస్తారట. (మళ్లీ ఈ ఆన్ లైన్ నమోదుని దళారుల ద్వారానే చెయ్యాలేమో!) వాళ్లు చెప్పిన తేదీని వాళ్లు చెప్పిన చోటుకి, వాళ్లు చెప్పిన టైముకి కుటుంబమంతా పొలోమని పోతే ఫోటో, ఐరిస్, వ్రేలి ముద్రలూ వగైరా సేకరిస్తారట. ఆ తరవాతెప్పుడో కార్డు ఇస్తారట!
అసలు ప్రతీ పౌరుడికీ ఇవ్వవలసిన ఆథార్ సంఖ్యని కుటుంబమంతటికీ ఒకే కార్డు మీద ఒకే సంఖ్య ఇవ్వడమేమిటో మరి.
వ్యవహారమంతా చూస్తుంటే, వెర్రి ముదిరింది, తలకి రోకలి చుట్టమన్నట్టూ, నీముక్కెక్కడ వుంది అంటే.......అన్నట్టూ లేదూ?
మన బుర్రోవాదులు ట్యూబ్ లైట్లు కూడా కాదు మరీ పెట్రోమాక్స్ లైట్లు అయిపోతున్నారేమో అనిపిస్తూంది!
నందన్ నీలేకనీ నిద్రలో కూడా వులిక్కిపడుతున్నాడేమో--తన పేరు నాశనం అవుతోందని.
మొన్న మావూళ్లో కొంతమంది పెద్దలు స్థానిక ఆర్డీవో ఆఫీసుముందు ధర్నా చేశారు. వాళ్ల డిమాండ్లలో ఒకటి--మద్యం దుకాణాలవాళ్లు ఎం ఆర్ పీ కన్నా చాలా యెక్కువకి, వాళ్ల ఇష్టం వచ్చిన రేటుకి మద్యం విక్రయిస్తున్నారు అనీ, వాళ్ల మీద చర్యలు తీసుకోవాలి అనీ!
ఇక్కడ "మద్యం చాలా మందికి నిత్యావసరం కాదు కదా?" అన్నది కాదు క్వశ్చను. "దోపిడీ యేరూపం లో యెక్కడవున్నా దాన్ని అరికట్టాలి" అన్నదే పాయింటు!
నాకు నచ్చింది మరి!