యంత్రాంగమా, గాడిదాంగమా?
మొన్న రాత్రి మళ్ళీ ఇండోనేషియా సముద్రం లో భూకంపం వచ్చింది--సునామీ బయలుదేరిందని వార్తలు వచ్చాయి.
ఇదివరకు ఇలాంటి భూకంపమే సునామీ తో మన తీర పట్టణాల కొంప ముంచింది.
ఇప్పుడు అందుకే అధికారులు ఉరుకులూ పరుగులూ పెట్టి, ఆఖరికి యేమీ లేదని ఊపిరి పీల్చుకున్నారు.
దేవుడు రక్షించాడుకాబట్టి సరిపోయింది.....లేకపోతే.....?!
2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ మన తీర ప్రాంతాల్ని వణికించడం తో, కేంద్ర ప్రభుత్వం 'సునామీ హెచ్చరిక కేంద్రాలు' స్థాపించాలని నిర్ణయించి, మన రాష్ట్రానికి ఆరు కేంద్రాలు మంజూరు చేసింది.
ఒక్కో కేంద్రానికీ--యెంతో కాదు--4 లక్షల ఖరీదు చేసే, డిజిటల్ పరికరాలని సరఫరా చేశారుట. వాటి బాధ్యతని మత్స్యకారుల సంఘాలకి అప్పగించారట.
మరి మన ప్రభుత్వం గొప్పతనమేమిటంటే, ఆ పరికరాలు పనిచేసేటట్టు చెయ్యడానికి, 3 వేల రూపాయలతో విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలట. తరవాత నెలవారీ వచ్చే విద్యుత్ బిల్లుల్ని చెల్లించాలట. మత్స్యకారుల సంఘాలు ఈ అదనపు భారాన్ని వహించలేమంటే, ప్రభుత్వం కూడా నా వల్ల కాదు అనేసిందట.
ఫలితం గా, కేంద్రాల్లోని లక్షల విలువ చేసే పరికరాలు 'అచేతనం' గా వుండి పోయాయట!
మంత్రుల దగ్గరనించీ ప్రతీ పదవిలో వున్నవాడికీ, వాడినా వాడక పోయినా పాతికో ముఫ్ఫయ్యో వేలతో కంప్యూటర్లిచ్చి, వాటికి యూ పీ యెస్ లని సహితం యేర్పాటు చేసే ప్రభుత్వం, దాని యంత్రాంగం, సునామీ హెచ్చరిక కేంద్రాలకి విద్యుత్ కనెక్షన్ లు ఇవ్వలేక పోయిందంటే, వీళ్ళనేమనాలి?
శాసన సభ్యులూ, అధికారులూ అందరికీ, సముద్రం ప్రక్కనే ఖచ్చితం గా నివసించాలని ఓ ఆర్డరు పాస్ చేస్తే, ఈ సమస్య తీరుతుందంటారా?
ఖచ్చితం గా తీరుతుంది.
ప్రయత్నించండి!