Sunday, February 28, 2010

సినిమాలు


మన తెలుగులో లెజెండ్ లూ, స్టార్ లూ, హీరోలూ, దర్శకులూ, కమెడియన్లూ, టెక్నీషియన్లూ తమ తమ్ముళ్ళూ, కొడుకులూ, మనమలూ, మేన కోడుకులూ, అల్లుళ్ళూ మొదలైన వారిని అందరినీ హీరోలు చేసేస్తూ, వివిధ రాష్ట్రాలనించి హీరోయిన్లని దిగుమతి చేసుకొంటూ, వాళ్ళ అందాలని ఆరబోయిస్తూ, తెలుగు భాషని ఖూనీ చేస్తూ, చేయిస్తూ, భవిష్యత్తులో యెప్పుడో
తియ్యవలసిన సినిమాలని ఇప్పుడే తీసేస్తూ, కోట్లు ఖర్చుపెట్టి, లాభాలు రాకపోయినా, టీవీ
చానెళ్ళకీ, సీడీలుగానూ అమ్ముకొంటూ, చింతించకుండా హంగామా చేస్తుండగా, బాలీవుడ్
వాళ్ళు ఇంకా షారుఖ్, సల్మాన్ మొదలైన ఖాన్లనీ, బచ్చన్లనీ, గోవిందాలనీ, అక్షయ్ లనీ, ముసలి హీరోయిన్లనీ వుపయోగించి, కొత్త కొత్త కథలతో, గొప్పగా సినిమాలు తీసి, కోట్లు దండుకుంటున్నారంటే--లోపం యెక్కడుంది?

బాలీవుడ్ కి దేశావ్యాప్తం గా, ప్రపంచ వ్యాప్తం గా మార్కెట్ వుంది--అన్నది కుంటి సాకు.

హాలీవుడ్ లో ఇప్పుడు అన్నీ 'విఠలాచార్య సినిమాలు ' తీసి, కోట్ల డాలర్లు నూకేస్తున్నారు!

మరి కీలకం యెక్కడుంది?

Saturday, February 27, 2010

వివాహ భోజనంబు


ఘటోత్క(రో)శయ్య

ముఖ్యమంత్రిగా రోశయ్య మొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లాకి వస్తున్నారట--27-02-2010 న.

ఆ సందర్భం గా, ఆరోజున ఆయన మధ్యాహ్న భోజనం కోసం క్రింది మెనూ ని సిధ్ధం చేశారట.

"అన్నంతో పాటు కొబ్బరి అన్నం, మరో యెనిమిది రకాల అన్నాలు, పులిహోర, చక్రపొంగలి, పెరుగావడ, గారె, గుత్తివంకాయ కూర, అరటికాయ కూర, బెండకాయ పులుసు, తోటకూర పెరుగు, బొబ్బట్లు, బిర్యానీ, కారప్పొడి, కరివేపాకు పొడి, శనగపొడి, నేతి ఆనపకాయ కూర, టమోటా...మునక్కాడ...జీడిపప్పు కూర, పెసరట్టు, మజ్జిగ చారు, పెరుగు, ఉలవచారు, సాంబారు, రసం, దొండకాయ కూర, ఆలూ చిప్స్, పన్నీపూల్ మఖాన్, మిక్స్ డ్ ఆవకాయ, బీరకాయ పుదీనా పచ్చడి, తాలింపు పప్పు, అప్పడాలు, వడియాలు, మామిడికాయ పప్పు, చల్ల మిర్చి, మిరపకాయ బజ్జి, పండ్లు...........ప్రత్యేక తాంబూలం!

పాపం ఆయనకి ఓ పంటిక్రిందకైనా వస్తాయో లేదో!

నేనే ముఖ్యమంత్రినైతే, అలాంటి మెనూ పురమాయించినవాడికీ, దానికి ఖర్చు పెట్టిన వాడికీ--ఓ వారం పాటు 'పావురాల కొండ ' చుట్టుపక్కలో, ఛత్తీస్ గఢ్ అడవుల్లోనో--కందమూలాలు తిని బతికే శిక్ష వేసేవాణ్ణి.

యెలా వుంది నా అయిడియా?


Thursday, February 25, 2010

తెలుగు

జాతీయాలు

'జీవగర్ర' 'పట్టుగొమ్మ' లాంటి పదాల్ని జాతీయాలు అంటారు--మన తెలుగుకే ప్రత్యేకమైనవి!

ఇక మన టీవీవాళ్ళు విరివిగా వుపయోగిస్తున్న 'పెద్దపీట' వెయ్యడం, లాఠీలు 'ఝుళిపించడం' 'పని చెప్పడం' 'నొక్కి చెప్పడం' 'వుధ్ఘాటించడం' లాంటివి కూడా!

మనలో మన మాట అది 'ఝుళిపించడం' కాదు--'ఝళిపించడం'! జడిపించారు, జడుసుకున్నారు లాంటి పదాలు వున్నాయి. జడిపించడం అంటే భయపెట్టడం--కొంచెం గ్రాంధికంగా 'ఝళిపించడం' అంటారు!

వాచీలు

ఓ ముఫై యేళ్ళ క్రితం చేతి వాచీ ని ఓ ఆభరణం గా భావించేవారు. యెవరైనా కొత్తగా వాచీ పెట్టుకొంటే, 'అబ్బో! చెయ్యి వాచిందే!' అని మెచ్చుకొనేవారు.

మరి ఇప్పుడు, సెల్ ఫోన్లు వచ్చాక, యెవరూ వాచీలు పెట్టుకోడం లేదు.

మా యింట్లోనైతే, నావీ, మా ఆవిడవీ, పిల్లలవీ వివిధ ఖరీదుల్లో కొన్నవాటి దగ్గరనించీ, ఉచితం గా వచ్చినవాటివరకూ ఓ పాతిక ముఫ్ఫై వాచీలు వున్నాయి--వాడకుండా మూలపెట్టినవి!

మరి ఇప్పుడు మన ప్రభుత్వం వారు, హెచ్ ఎం టీ వాచీలని మన 'ఆప్కో' షాపుల్లో అమ్మిస్తారట!

సెల్ లో ఎస్ ఎం ఎస్ ల రూపం లోనూ, ఈమెయిల్ లోనూ ప్రతీరోజూ రెండో మూడో వస్తున్నాయి--60% ఆఫ్ తో వాచీ కొంటే, 'రీబోక్' బూట్లు ఉచితం అని! మరి 40% రేటే కొన్ని వేలల్లో వుంటే, వాటి అసలు రేటు యెన్ని వేలో? మరి ఈ వాచీలూ, రీబోక్ లూ యెవరు కొంటున్నారో?

Tuesday, February 2, 2010

అదుగో పులి

వైష్ణవి

గత మూడురోజులుగా టీవీ '24 గంటల న్యూస్ ' చానెళ్ళు బ్రతుకుతున్నది ఈ మాట పైనే!

అది యెంతవరకూ వెళ్ళిందంటే, కాంగీరేసు, టీడీపీ, తెరాస, చిన్నా పెద్దా నాయకులూ, చిరంజీవీ, దత్తాత్రేయలే కాకుండా, తెలంగాణా జే యే సీ లో సంతాప తీర్మానం చేసీ, మీడియాలో దాని కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామి రెడ్డి 'వైష్ణవి, ఆమె తండ్రి మరణాలు మమ్మల్ని కలచివేశాయి ' అనేదాకా!

ఇంకా కొంతమంది యెంతవరకూ వెళ్ళారంటే, రేపు తెలంగాణా ఇచ్చేస్తే, విజయవాడ ఆంధ్ర ముఖ్యపట్టణమైతే, శాంతిభద్రతలు ఇలావుంటాయి అని చెప్పడానికి ఇదో హెచ్చరిక--అనేదాకా!

అసలు జరిగిందేమిటి?

నీచ, నికృష్ట, దీన మాన హీన స్థితిలో వుండే ఒకడు--కాపుసారా బట్టీలో వుద్యోగిగా చేరి, బాస్ గా యెదిగి, తెలుగు వారుణవాహిని పుణ్యమాని లక్షాధికారై, నిషేధం తీరాక సిండికేటై, ఇప్పుడు కోటీశ్వరుడై, ఇద్దరు పెళ్ళాల్నీ, లెక్కలేనన్ని ముండల్నీ నిర్వహిస్తూ, రెండో పెళ్ళం కోరిక మీద 'ఆ పిల్ల ' పుట్టిన రోజుల్ని ఘనం గా నిర్వహిస్తూ, 'వైష్ణవి నా ప్రాణం' అని ప్రకటించి, ఆస్థి అంతా ఆమె పేరే వ్రాసేశాడు అని వచ్చిన పుకారుని ఖండించకుండా ఆనందించిన ఒక మూర్ఖుడి మీద కక్ష తీర్చుకున్నారు--వాడి ప్రత్యర్థులు!

దీన్ని అదేదో రాష్ట్ర విపత్తు అన్నట్టు 'కలర్ ' ఇస్తున్న మన మీడియా చెంప పగలకొట్టేదెవరు?

ఇది ప్రపంచానికే ఆపద అన్నంత బిల్డప్ ఇస్తున్న ఈ రాజకీయుల నడ్డి విరిచేదెవరు?

'వైష్ణవి మా పిల్ల--ఆమె చిరునవ్వులు చిందిస్తూ తిరిగి వస్తుంది--లేకపోతే......' అంటూ 'హిస్టీరియానిక్స్ ' ఒలకబోసిన నా అక్కల్లారా, చెల్లెళ్ళారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా!....మైక్ మీ నోటి ముందు పెట్టగానే 'ఎమోషనల్ ' అయిపోయి, పిచ్చి మాటలు మాట్లాడకండి! 'వెధవల్లారా! నేను మాట్లాడనురా!' అనండి!

అప్ప్పుడైనా ఈ మీడియాకీ, రాజకీయులకీ బుధ్ధి వస్తుందేమో చూద్దాం!

P.S.:--వైష్ణవి శవం దొరకలేదు--బూడిదనే శవం అనుకోమంటున్నారు ABN టీవీ వారు! దానికే అంత్యక్రియలు నిర్వహించారు అంటున్నారు మిగతా ఈ మీడియా వారు!



Monday, February 1, 2010

యాయవారం

శుభాకాంక్షలు

మనకి స్వాతంత్ర్యదినం; రిపబ్లిక్ దినం; బాలల దినం; ఉపాధ్యాయుల దినం; అమరవీరుల దినం--ఇలా కొన్ని ఆల్రెడీ వున్నాయి.

ఫారిన్ వాళ్ళ పుణ్యమాని, వేలంటైన్ దినం, ప్రేమికుల దినం లాంటివి దిగుమతి అయ్యాయి.

ఐ. రా. స.--యువకుల దినం, యువతులదినం లాంటి మరిన్ని ప్రకటిస్తూ వుంటుంది.

ఇక శుభాకాంక్షలు చెప్పుకోడానికి దాదాపు ప్రతి రోజూ యేదో ఒక దినం వుంటుంది.

మన టీవీ వాళ్ళయితే, ఆ దినానికి ఓ మూడు రోజుల ముందూ, 4 రోజుల తరవాతా కూడా చెపుతూనే వుంటారాయె.

ఇంకా యే దినం గుర్తుకి రాకపోతే, మరో మార్గం వుంది.

ఇదివరకు రోజుల్లో, యాయవారపు బ్రాహ్మలనీ--వచ్చేవారు--'చతుస్సాగర పర్యంతం......'అని ప్రారంభించి, ఆ రోజు తిథి, వార నక్షత్రాలు, వర్జ్యాలు, దుర్ముహూర్తాలు చెప్పి, బియ్యమూ, ఇస్తే స్వయంపాకమూ తీసుకెళ్ళేవారు.

ఆ వరసలో, 'నమస్కారం! ఈ రోజు మా ప్రేక్షకులకి శ్రీవిరోధినామ సంవత్సర మాఘబహుళ పాడ్యమి, ఆదివారం శుభాకాంక్షలు!' అని చెప్పుకోవచ్చు!

యెలా వుంది?