Wednesday, October 21, 2009

సంవాదం-2

నార, మంగేష్ లతో

చదివి--"అవును. విశ్వామిత్ర మహర్షి సమస్త మానవాళికే కాదు ప్రకృతిలో వున్న అన్ని జీవులకూ ఇచ్చాడు! గ్రహించే ఙ్ఞానం వున్నవాళ్ళే అనుష్ఠించారు! మిమ్మల్ని ‘అధికారికం గా’ చెప్పమన్నాను గానీ ‘జీ వో’ చూపించమనలేదు! ఆవిషయం యెక్కడో అక్కడ చెప్పబడో, వ్రాయబడో వుండాలికదా? అది వినో, చదువుకొనో మీరు ఆ విషయం తెలుసుకుని వుండాలికదా? అదే చెప్పమన్నాను—అంతే! చెప్పగలిగితేనే చెప్పండి—లేకపోతే లేదు అనుకుంటాము!

'............పండితుల్ని కాక…అంటే? సద్గురువులంటే యెవరు? తెల్లగడ్డాలు, మీసాలు పెంచుకొని, నెత్తికీ, ఒంటికీ కాషాయ రంగు గుడ్డలని కట్టుకొని, ‘భగవంతుడు అంటే భగం వున్నవాడు’ ‘నేను నా సంగీతం తో, వాయిద్యం తో మీ రోగాలన్నీ నశింపచేసి, మోక్షాన్ని ఇస్తాను’—ఇలాంటి పిచ్చి వుపన్యాసాలిచ్చేవాళ్ళా?

ఇక ‘పరిమిషన్’ సంగతి—నాటపాలోనే వ్రాశాను—ఒకటి నమ్మితే, రెండోది నమ్మాలి—అని! ఇక మీ యిష్టం, చదివే, పాడే వాళ్ళిష్టం!

అని నా సమాధానం లో వ్రాశాను!

దీనికి మంగేష్ కామెంట్: Mangesh said...

చాలా సంతోషం. మీ టపాలు చదివాక నాకు అర్థమైనది ఒక్కటే. మీకు దేనిమీద నమ్మకం లేదు. ఉన్నది అనుకుంటున్నారు. సర్వము తెలుసు అనుకుంటున్నారు. ఎవరికైనా తెలియవలసినది చాలా వుంటుంది. తెలిసినది చాలా తక్కువ వుంటుంది. ఆ రెండూ కలిపితేనే పూర్ణమైన సత్యమవుతుంది. తప్పక మీకు గాయత్రి అనుగ్రహము కలగాలి అని ప్రార్థన చేస్తాను. అది వెలిగితే వున్న చీకటి తొలగిపొతుంది. సత్యము భోధ పడుతుంది. ఇదే నా చివరి కామెంట్. ఎందుకంటే ఎంత చెప్పినా ఉపయోగము లేదు కనుక. నా సమయము వృధా చేసుకోను.

మళ్ళీ నేను అన్నది--"నిజంగా నాకు దేనిమీదా నమ్మకం లేదు--వున్నది అనుకుంటున్నానని మీకు యెందుకు అనిపించిందో మరి! సర్వమూ తెలుసని నేనెప్పుడూ అనుకోలేదు--అనలేదు! అందరికీ అన్నీ తెలియవు--ఆ అవసరం కూడా లేదు.

ఐన్ స్టైన్ తన పెంపుడుపిల్లి తన ఇంట్లో అన్నిగదుల్లోకీ స్వేచగా తిరగాలని, తలుపులకి అది దూరగలిగేంత కన్నాలు పెట్టించాడట. ఆ పిల్లి ఒకేసారి యేడు పిల్లల్ని పెట్టగానే, అన్ని తలుపులకీ, తల్లి కోసం పెట్టించిన కన్నం పక్కన యేడు చిన్న చిన్న కన్నాలు పెట్టాడట!

దితి, 'ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి ' అని హోమం చేస్తుంటే, ఇంద్రుడు వెళ్ళి సరస్వతీదేవి కాళ్ళమీద పడితే, ఆవిడ దితి నోటిలో ప్రవేశించి, నాలుక తడబడేట్టు చేసి, 'ఇంద్రుడు చేతిలో చచ్చే కొడుకు కావాలి ' అనిపించిందట! పర్యవసానం అందరికీ తెలుసు కదా? ఇదైనా నమ్ముతారా?

మనిషన్నవాడు ఆమరణాంతం 'నేర్చుకుంటూనే' వుంటాడని నమ్మేవాణ్ణి నేను! నేన్నన్నీ చదువుతాను--ఆకళింపు చేసుకోడానికి ప్రయత్నిస్తాను--అది సమయం వృధా చేసుకోవడం అనుకోను!"

దీని తరవాత మంగేష్ వ్రాసింది '.........బహుశా మీకు గాయత్రి గుర్తు వచ్చినప్పుడల్లా నేను మీ మదిలో మెలుగుతానేమో. నేను మీ టపాలు చదివిన తరువాత మీ మేధస్సు అర్థమైనది. మీరు పడుతున్న శ్రమ అర్థమైనది. మీకు నా థన్యవాదములు. ................జరుగుతున్న వాటిని విమర్శిస్తేనో, బాగా తిట్టితేనో మార్పు రాదు. మార్పు సహజంగా లోపలి నుండి కలగాలి. ఎవరు ఎన్ని చెప్పినా తనకు తోచిందే నిజం అని భావించటం మానవ నైజం. కొంత మంది మాత్రమే అన్నిటిలోనున్న సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నించి కృతకృత్యులవుతారు. మనకు తెలిసిందే సత్యము కాదు. అలా అని తెలియంది కూడా సత్యము కాదు. రెండూ కలిపి సత్యము. మీ రచనలతో ప్రజలను చైతన్య వంతులను చేయండి. వారిని మేల్కొలపండి. జాగృతులను చేయండి. ప్రేమతో చెప్పండి. ప్రేమతో సమస్తమును జయించ వచ్చును. మీరు కొన్ని టపాలలో ఒక వర్గ విమర్శ చేసినందుకు చాలా విమర్శలు వచ్చాయి. మీ ఉద్దేశ్యము మంచిదే అయిననూ దానిని అందరూ మెచ్చే విధముగా తెలియచేయవలెను కదా? మనసు కాక హృదయము స్పందించ వలెను. హృదయము నందు కలిగిన మార్పే నిజమైన మార్పు. అంటూ యేమేమో వ్రాశారు!

నేను--'యేకహస్తం' (single handed)తో చేస్తున్న కృషిని అర్థం చేసుకొన్నందుకు ధన్యవాదాలు! అక్కడ గాయత్రి ముఖ్యం కాదు--మీ 'perception' ముఖ్యం నాకు. మీరు చెపుతున్నవి చాలా బాగుంటున్నాయి-'యోగములు, ధ్యానములు, మంత్రములు.....మిగిలినవారు కూడా దానిని........అందించారు' అన్నది అక్షర సత్యం!

కానీ ఆ పేరుచెప్పుకొని వ్యాపారాలు చెయ్యడం (పాపం పొట్టకూటికే అన్నాసరే), వేలంవెఱ్ఱుల్ని ప్రోత్సహించడం యెంతవరకు సబబు?

'......అందరికి కలగాలి......ప్రయత్నిద్దాం.' అనేమాటలు నా చెవుల్లో అమృతం పోశాయి!' అని వ్రాశాను నేను!

Monday, October 19, 2009

సంవాదం

నార--మంగేష్ లతో
గాయత్రీ మంత్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న తీరు గురించి నా టపాలో నేను వ్రాసినదానికి--

ఈయన వ్యాఖ్యలో: "గాయత్రి అనగా వెలుగు." గాయత్రిని గానము చేయుటకు జాతి, మత, కుల, వర్గ విభేదములు ఎమీ లేవు. ఆడా వారు కూడా మగవారిలా గాయత్రి మంత్రము చేసుకోవచ్చు. దీనిని మన ఋషులే అంగీకరించారు. అనేక దేశములలో ఎంతో మంది గాయత్రి మంత్ర గానము చేయుచున్నారు.' అని వ్రాసి, తన బ్లాగుకి లింకులు ఇచ్చారు!

ఆయన బ్లాగులోకి వెళితే, 'Masters Voice' అని లింక్ కనిపించింది. సరే, అదేమిటో చుద్దాం అనుకుంటే, దానికో గాడ్రెజ్ తాళం కప్ప!

(నిన్న మొన్న మళ్ళీ ఆ టపా దగ్గరకి వెళితే, ఆయన 'About Me' లో ఇప్పుడు వాళ్ళ మాస్టర్ల పేర్లు కనిపిస్తున్నాయి--అప్పుడు అవి లేవు!)

హెచ్ ఎం వీ అని ఓ గ్రామఫోన్ రికార్డుల కంపెనీ వుండేది. దాని చిహ్నం ఓ కుక్క గ్రామఫోను రికార్డు ద్వారా, స్పీకరులోంచి తన యజమాని గొంతు వింటున్నట్లు ఓ బొమ్మ! (గ్రామఫోన్ రికార్డుల మీద 'అథారిటీ' శ్రీ వీ యే కే రంగారావుగారు, ఆయనకి కోపం వచ్చినప్పుడు దాన్ని 'కుక్క కంపెనీ' అని తిట్టేవారు!). ఈయన బ్లాగు యేదో అలాంటి వ్యవహారమేమో అనిపించింది!

అందుకే నేను చాలా మర్యాదగా అడిగాను! ".................మీ 'మాస్టర్లు' యెవరో తెలియ లేదు............ గాయత్రిని ‘గానం’ చెయ్యచ్చు అనీ, ఆడా మగా తేడా లేకుండా, జాతి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ చదవచ్చు, పాడచ్చు అనడానికి ఆ విషయం యెవరు యెక్కడ చెప్పారో అధికారికం గా వ్రాయరేం?..........ముందు ‘గురు బ్రహ్మ’ చదవాలని చెప్పారు. బాగుంది. మరి ఆ పాడువారందరికీ యే గురువు వుపదేశించాడని వాడికి వందనం చెయ్యాలి? వివరిస్తే బాగుండేది. అని.

దానికి ఆయన తిరిగిన డొంకలూ, ఇచ్చిన సమాధానం చదవండి! "అధికార పత్రం చూపించటానికి గాయత్రి మంత్రము గవర్నమెంట్ G.O కాదు........ఇక గురువు ఎవరికి వందనము చేయాలి అన్నారు. గురువు ఒక్కడే............ఆ దైవమునే English లో "master" అంటారు. master అంటే స్వామి అని అర్దము. "గురు బ్రహ్మ" మంత్రములో చెప్పబడిన గురువు అతడే...........వ్యక్తము కాని దైవము వ్యక్తము ఐనపుడు వెలుగై వ్యక్తమౌతాడు............."

యేమైనా తలా, తోకా దొరుకుతున్నాయా? 1. ముందు 'దైవమూ అనబడే, ఇంగ్లీషులో మాస్టర్ అనబడే,........చెప్పబడిన గురువు.......(కి వందనం చెయ్యాలి--తరువాత గాయత్రి చదవాలి/పాడాలి.) 2. దైవము వ్యక్తము ఐనప్పుడు వెలుగై వ్యక్తమౌతాడు......(అంటే, గాయత్రి చదివిన తరవాతగానీ వ్యక్తమవడుకదా?) 3. అదే మూల ప్రకృతి. అతడు పురుషుడైతే ఆమె ప్రకృతి. అంటే....వెలుగై వ్యక్తమయే'వాడూ మూల ప్రకృతి. మరి అతడు 'పురుషుడైతే', ఆమె ప్రకృతి!?!

విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రమును సమస్త మానవజాతికి ఇచ్చాడు. అందులో అందరూ వస్తారు. భేదాలు ఎమీలేవు. పండితుల్ని కాక సద్గుగువులనెవరినైనా అడిగి తెలుసుకొన గలరు. ఇదీ ఆయన సమాధానం!

(మిగతా మరోసారి)

Monday, October 12, 2009

అర్థం లేని సమర్థనలు.....

తానా అనేవాళ్ళకి తందానా అనేవాళ్ళూ!

మొన్ననే నా తెలుగురాడికల్ లో 'భావ వ్యక్తీకరణ కళ' పేరుతో ఇలాంటివాళ్ళకి యేమైనా బుద్ధి మారుతుందేమో అని చూశాను! కానీ పుట్టుకతో వచ్చినదనుకుంటా--ఇంకా మారలేదు!

సరే--ఇంక వాళ్ళని పోతిరెడ్డిపాడు పంపించినా, లాభం వుండదనిని నిశ్చయించుకొని, పాఠక దేవుళ్ళకే అర్జీ దాఖలు చేస్తున్నాను!

ఒక రకం వాళ్ళు--వీళ్ళు యేదీ పూర్తిగా చదవరు! చదివిందానిని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించరు! యేవో మూడు ముక్కలు ముక్కున పట్టుకుని, తాము ఇంతకుముందు కొంతమంది వ్రాసిన వ్యాఖ్యలనించి కొన్ని 'ఫ్యాషనబుల్' యెంగిలి డైలాగులు వాడేసి, 'యెలా కొట్టాను దెబ్బ?' అన్నట్టు అందరివంకా చూస్తారు!

వీళ్ళ స్టాండర్డ్ యెంగిలి డైలాగుల్లో మొదటిది--'ఆధారాలు యేమిటి?'

ఇంతకు ముందు రెండో మూడో నెలలనించీ వ్రాసిన టపాలూ, వ్రాసిన ఆధారాలూ చదవాలనే ఇంగిత ఙ్ఞానం వుండదు వీళ్ళకి!

రెండోది, 'అక్కడ అలా వ్రాశారు........' అని!

వీళ్ళు ఒకటి మరిచిపోతుంటారు--ఒకళ్ళు వ్రాసే--తాను చెప్పదలుచుకున్న విషయాలూ, ఇతరులు అన్నవీ, విన్నవీ, చదివినవీ 'కోట్' చెయ్యడమూ--రెండూ ఒకటే అనుకుంటారు! (అందుకే 'ఉట్టంకింపులకి' చివర 'ట' చేరుస్తాను నేను!--దీన్నికూడా అపార్థం చేసుకున్నవాళ్ళున్నారు!)

ఇక మూడోది--రామాయణం అంతా విని, రాముడు కి సీత మేనత్త అవుతుందా? పిన్ని అవుతుందా? అని అడిగినవాళ్ళ గురించి విన్నాం! (నిజంగా వాల్మీకి రామాయణం ప్రకారం ఈ రెండు వరసలూ వున్నాయి అని నమ్మేవాళ్ళు వున్నారు--విఙ్ఞులెవరైనా వివరింపగలిగితే, సంతోషం!).

కానీ, రామాణయం చదవకుండానే, వినకుండానే, 'హనుమంతుడు రాముణ్ణి చేరాడు' అంటే--'అసలు ఈ రాముడెవరు?' అని కళ్ళెర్రజేస్తారు!

నాలుగోది--'యేళ్ళు వచ్చాయిగానీ బుధ్ధి రాలేదు'!

సందర్భ శుధ్ధి లేకుండా వీళ్ళు వాడే యెంగిలి వాటిలో ఇది మొదటిది!

తాతా మామ్మలూ, తల్లి తండ్రులూ పిల్లలని మందలించడానికి వాడే మాటలవి! చదవేసేవరకూ 'కాకరకాయ ' అన్నవాడు, బడినించి వచ్చాక 'కీకరకాయ ' అంటే--అలాంటివాళ్ళని ఇలా మందలిస్తారు!

మనిషి భౌతిక వయస్సుకీ, మానసిక వయస్సుకీ వుండే నిష్పత్తిని 'ఐ క్యూ' అని వ్యవహరిస్తారు! అది సమానంగా వుంటే--బాగుంది అనుకుంటారు, యెక్కువగా వుంటే--ఓహో అంటారు, తక్కువగా వుంతే--పాపం అంటారు! దాన్ని పెంచుకోమని చెప్పడమేకాదు, పెంచడానికి వాళ్ళుకూడా ప్రయత్నాలు మొదలెడతారు!

ఇలాంటి మాటలు విస్తృతంగా వాడేవాడిని నా విద్యార్థి అయితే, బెంచీ యెక్కించేవాడిని! నా కొడుకు ఆ మాట వాడితే, వాడి పెళ్ళాం చేత వాడికి బుధ్ధి చెప్పించేవాడిని! (ఇప్పుడు కార్పొరేట్ విద్యలో 'బెంచీ యెక్కడాలూ' అవీ లేవు! డైరెక్టుగా ఆత్మహత్యలే!)

ఇవీ 'తందానా' అనేవాళ్ళ కొన్నిసంగతులు!

తరవాత--తలా తోకా లేనివాటిగురించి! (మరోసారి)

నా విఙ్ఞప్తి :- పాఠకుల ముందుంచుతున్న నా 'కేసు ' పూర్తయ్యేవరకూ, మంగేష్ లూ, నారాలూ మాట్లాడకుండా వుండడం న్యాయ సూత్రాల రీత్యా అభిలషణీయం! తరవాత మీ యిష్టం!