అవీ, ఇవీ, అన్నీ
(అలవాటైన 'సణుక్కోవడం ' మానలేదుగానీ, అందరికీ వినపడేలా సణగడం ఈ మధ్య వీలుకావడంలేదు. క్షంతవ్యుణ్ని!)
"ఈనగాచి నక్కలపాలు"; రాజులసొమ్ము రాళ్లపాలు; పీనాసి సొమ్ము దొంగలపాలు; ప్రభుత్వం సొమ్ము గుత్తేదాదులపాలు; దాతలసొమ్ము దోపిడీదారులపాలు--ఇలా యెన్నైనా చెప్పుకోవచ్చు!
మా జిల్లా కలెక్టరు (వాణీ ప్రసాద్), పాపం తన మాతృహృదయంతో, సామాన్యులకీ, ముఖ్యంగా గిరిజనులకీ "వైద్య సహాయం" పెంచడానికి, ఓ వైద్య నిధి యేర్పాటు చేశారు. అక్కణ్నించీ ప్రభుత్వోద్యోగులు--ముఖ్యంగా రెవెన్యూ వాళ్లు యెగబడి, ఒకరోజు వేతనలూ, కొంతమందైతే భూరి విరాళాలూ ఇస్తూ పేపర్లలో ఫోటోలు కూడా వేయించుకొన్నారు.
ఇంకా, మొన్న 11-11-11 న 11-11 కి ఈ విద్యనిధిని ట్రస్టుగా రిజిస్టరు కూడా చేసి, పేపర్లలో వేయించారు. (ప్రభుత్వాధికారులు ఇలాంటి పనులు చెయ్యొచ్చా? వీటివల్ల వుపయోగం వుంటుందా? వాళ్లు బదిలీపై వెళ్లిపోయాక ఆ సంస్థల, వాటిలో నిల్వల గతి యేమిటి? ఇలాంటివాటి గురించి ఇదివరకో టపాలో వ్రాసినట్టున్నాను.)
నీకేం బాధ? అంటారా.....అక్కడికే వస్తున్నా. కొన్ని లక్షల నిధులతో, మా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో, బుట్టాయగూడెం, పులిరామన్నగూడెం, పోలవరం ల లోని ఆరోగ్య కేంద్రాలకీ, ఆసుపత్రులకీ--అత్యాధునిక వైద్య పరికరాలూ, ఇంకా భీమడోలు, ద్వారకా తిరుమల, చింతలపూడి, కొయ్యలగూడెం, ఆకివీడు వైద్యాలయాలని అభివృధ్ధి చేసి, ఒక్కోదానికీ రూ.16 లక్షల విలువైన పరికరాలని అందించారట. భవనాల ఆధునికీకరణకి ఒక్కోదానికీ ఓ 6 లక్షలు ఖర్చు చేశారట.
"మన్యంలో కార్పొరేట్ వైద్యం" అంటూ, ఈ సీ జీ, సెమీ అనలైజర్, హైడ్రాలిక్ ఆపరేషన్ థియేటర్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ లాంటి 18 రకాలైన ఉపకరణాలూ, మంచినీటి శుధ్ధి యంత్రాలూ, సౌర విద్యుత్ ఉపకరణాలూ సరఫరా చేశారట. (ఇవన్నీ ఇప్పటికే మూలన పడ్డాయట!). ఇంకెందుకని, కొన్ని ఉపకరణాలని జంగారెడ్డిగూడెం లాంటి పట్టణ ప్రాంతాలకి తరలించేశారట.
మూల కారణం? ఆ ఉపకరణాలకి తగ్గ సిబ్బందిని నియమించలేకపోవడమేనట!
సంబంధిత శాఖాధికారులనడిగితే, షరా మామూలేగా, చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం, వ్రాసి పంపించాము కదా? ఇంక పైవాళ్ల చేతుల్లో వుంది--లాంటి సమాధానాలిస్తున్నారట!
పథకాలు నీరైపోయినట్టు, మన గుండెలుకూడా నీరయి పోవడంలేదు?
ఇంక, ఘనతవహించిన సేవా సంస్థలు యేమి చేస్తున్నాయి?
మొన్ననే మా హేలాపురి--అదేనండీ--ఏలూరు లో "లయనెస్సెస్" క్లబ్బువారు వార్షిక మహోత్సవాలో యేవో, కొన్ని రోజుల పాటు ఘనంగా నిర్వహించి, సభ్యులకి "కూరగాయలతో కళాకృతులు తయారుచెయ్యడంలో" పోటీలూ, "స్త్రీల సుందర కేశాలంకరణ" పోటీలూ వగైరాలు నిర్వహించి, ఘనంగా బహుమతులు ప్రకటించుకున్నారట.
యేసొమ్ము యెవరి పాలు అంటే యేమంటాము?
ఘనత వహించిన "రాజీవ్ విద్యా మిషన్" విద్యార్థులకి "వినూత్న" బోధన లో భాగంగా, "విందాం, నేర్చుకుందాం" అనే "రేడియో" పాఠాల కార్యక్రమం మా జిల్లాలోని 2650 ప్రాథమిక పాఠశాలలు, 260 ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండేళ్లక్రితమే ప్రారంభించారట. ఫలానా రోజు, ఫలానా క్లాసులవారికి, ఫలానా పాఠమో, ఆటో, ఇంకోటో ప్రసారం చేస్తామని, సంబంధిత శాఖ నుంచి పాఠశాలలకి "కరదీపిక"లు (హేండ్ ఔట్ కో, హేండ్ బుక్ కో మన ఈనాడువారి తెనుగుసేత అనుకుంటా) ముందే సరఫరా చేస్తారట. ఆ సమయాల్లో రేడియోలు పెట్టుకొని, వినేసి, నేర్చేసుకోవడమే!
కానీ, "కర్రుంటే పాముండదు, పాముంటే కర్రుండదు" అన్నట్టు, కరదీపికలో ప్రకటించినవాటికీ, ప్రసారమౌతున్నవాటికీ పొంతనే వుండడం లేదట. ప్రసారమౌతున్నవాటికి కరదీపికలే ముందుగా అందడం లేదట! (అసలు కరెంటు వుంటోందా?) పాపం ఉపాధ్యాయులూ, విద్యార్థులూ తెల్లమొహాలు వేసుకొని....ఆ పైన, ఇంకేం చేస్తారు? ఆడుకోమంటారు!
మరి యెప్పుడో మూలపడ్డ రేడియోల (వాటికెంత ఖర్చయ్యిందో?) ద్వారా విద్యా బోధనలాంటి అద్భుతమైన అవిడియాలతో క్రిక్కిరిసిపోయిన వాళ్ల బుర్రలు పగులకొట్టి, వాటిలో విలువైన వజ్రాలు ఇప్పటికే యేర్పడిపోయాయేమో పరిశోధించవద్దూ?
మా వూళ్లోనే వున్న "స్వర్ణాంధ్ర" ఇంజనీరింగు కళాశాలల విద్యార్థులు "న్యూ కలర్స్" అనే సంస్థని యేడాది క్రితమే స్థాపించి, నెలకి ఇంత అని పోగుచేసి, యెక్కువ మొత్తం అయ్యాక, చుట్టు ప్రక్కల పల్లెల్లోని వృధ్ధులకీ, పేదలకీ, బియ్యం, బట్టలు, దుప్పట్లూ వగైరాలు పంపిణీ చేస్తున్నారట. మొన్ననే ఓ 25 మంది వృధ్ధులకి, 25 కేజీలచొప్పున, 25 బస్తాలలో బియ్యం పంపిణీ చేశారట.
యేమిటో! మన అన్నపూర్ణ, పేదలమీద బియ్యం వర్షం కురిపిస్తోంది! ప్రభుత్వం కేజీ రూపాయికే ఇచ్చేస్తోంది--నెలనెలా కోటా పెంచుతూ! రాష్ట్ర సరిహద్దులుదాటి బియ్యం అమ్మకపోతే, రైతులు దివాళా తీస్తారంటున్నాడు జేపీ! మిల్లర్లేమో ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ బియ్యాన్నీ, లెవీ బియ్యాన్నీ, తరలించేసి బాగుపడుతున్నారు. మనం మాత్రం బజార్లో కేజీ 30 కి తక్కువకాకుండా కొనుక్కొని సుఖపడుతున్నాము.
(సర్కారుకూడా నిన్ననే--మేము యెగుమతులపై నిషేధం విధించలేదు, తరలింపుకి వున్న ఆంక్షలని కూడా తొలగించేస్తాము--మరి రేపణ్నించీ సభలో యెవరూ బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగాయి అని ఫిర్యాదు చెయ్యకూడదు--అలా అయితే మేము సిధ్ధమే! అంటోంది. వీటి భావమేమో మేధావులే చెప్పాలి మరి!)
బియ్యం మాత్రం సదా వర్షించుగాక!