లజ్జారహిత మంత్రిణి
- 150 మంది మృతి చెందిన ఙ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం "సర్కారు అంటే గిట్టనివారు పన్నిన కుట్ర"ట.
- 63 మంది అశువులుబాసిన వనాంచల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక రైల్వేలని "బదనామ్ చెయ్యాలనుకుంటున్న వర్గాల ప్రమేయం వుందని" అనుమానం ట.
- ఢిల్లీ స్టేషన్ లో, రైలు వస్తూందనగా, ప్లాట్ ఫామ్ మార్చామని ప్రకటించి, అందరూ మెట్లెక్కుతుండగా, మళ్లీ అది తప్పు అనీ, ఇదివరకు అనౌన్స్ చేసిన ప్లాట్ ఫామ్ మీదకే వస్తుందనీ చెప్పడం తో, తొక్కిసలాటలో అనేక మంది గాయ పడ్డారు, ఇద్దరు మరణించారు. "తప్పంతా జనాలదే! బుధ్ధిలేకుండా అలా పరుగులు పెట్టడం యేమిటి" అని ఈసడించారట.
ఇవన్నీ యెవరు అన్నారు? ఇంకెవరు--మమతాదీ నే!
రైల్వేలలో 89,000 వుద్యోగాలు కొన్ని యేళ్ళుగా ఖాళీగా వున్నాయట.
అందులో 20,000 వుద్యోగాలు "రైల్వే భద్రత, రక్షణ"లకి సంబంధించినవేనట.
26,000 డ్రైవర్ పోస్టులు ఖాళీగా వున్నాయట. 7 గంటలు మాత్రమే పనిచెయ్యవలసిన డ్రైవర్లు, పది పదిహేను గంటలు
పనిచేస్తున్నారట!
రైలు మొత్తానికి ఒకే టీ టీ ఈ తో నడుస్తున్న రైళ్ళు చాలా వున్నాయట.
బ్రిటీష్ వాళ్ళు నిర్మించిన రైలు మార్గం 52,000 కి. మీ. లైతే, స్వతంత్రం వచ్చాక 63 యేళ్ళలో కొత్తగా నిర్మించింది కేవలం 12,000 కి. మీ. కూడా లేదట.
ఇక "తృటిలో" తప్పిన ప్రమాదాల గురించి, రోజుకి రెండో మూడో వింటూనే వున్నాము.
ఇక ఇప్పుడు, ముఖ్యమైన స్టేషన్లలో ఒక్కోటీ 70 లక్షలు ఖర్చయ్యే "ఎస్కలేటర్లు" నిర్మిస్తారట! (మెట్లెక్కుతూనే
తోసుకొనే ప్రయాణీకులు ఎస్కలేటర్లు యెక్కడం లో యెన్ని ప్రమాదాలకి గురవుతారో!)
ఆ మాత్రం ఖర్చుతో ఒక్కో ప్లాట్ ఫామ్ మీదా అటు రెండూ, ఇటు రెండూ లిఫ్టులే యేర్పాటు చెయ్యవచ్చు! పైగా సురక్షితం గా వుంటాయి.
(తిరుపతిలోని శ్రీనివాసం గెస్ట్ హౌస్ లో వున్నాయి ఇలా లిఫ్ట్ లు. అక్కడ అనేక అంతస్తులు వున్నాయి. మరి ప్లాట్ ఫామ్ మీదైతే, ఒక్క అంతస్తే కదా?)
మరి ఈ స్కీమే యెందుకంటే, వేరే అడగాలా--కోట్లు నొక్కెయ్యడానికని తెలియడం లేదూ!
రైల్వే శాఖ వెబ్ సైట్ లో కూడా, ఈ-టిక్కెట్లని అమ్ముతారట--ఐ ఆర్ సీ టీ సీ గుత్తాధిపత్యాన్ని నివారించడానికి! (ఇక రెంటికీ చెడ్డ రేవళ్లవుతారేమో అమాయక ప్రయాణీకులు!)
ఇదివరకే ఓసారి వ్రాశాను--ఇంకా రైళ్లలో గమ్యం చేరగలుగుతున్నారంటే, నిబధ్ధతతో వుద్యోగాలు చేస్తున్న
కొన్నివేల--గ్యాంగ్ మెన్ లూ, పాయింట్ మెన్ లూ, సిగ్నల్ మెన్ లూ వగైరాల వల్లే గానీ, ఇలాంటి 'మమత 'ల వల్ల కాదు అని.
ఇలాంటివాళ్ళని మంత్రివర్గం లో వుంచి, మేపుతున్న ఖర్మ మన కేంద్ర సర్కారుది!
హేపీ జర్నీ!