Tuesday, May 24, 2011

కబుర్లు - 48



అవీ, ఇవీ, అన్నీ

"ద్వారకా తిరుమలలో......పులిహోరలో బల్లి!" ఓ సంచలన వార్తా, దానిమీద భక్తుల ఆందోళనా, కొన్ని వేల పొట్లాల భూస్థాపితం!

డాక్టర్లు ఆ పులిహోర తిన్నవాళ్లని పరీక్షించారు.....యెవరూ మరణించలేదు.... యెవరికీ అనారోగ్యం కూడా కలగలేదు!

ఐదు దశాబ్దాలుగా హేతువాదులూ, డాక్టర్ సమరం లాంటివాళ్లూ మొత్తుకొంటున్నది "బల్లి విష జంతువు కాదు. అది వుడుకుతున్న యే పదార్థంలో పడినా, ఆ పదార్థం విషపూరితం కాదు. యెక్కువలో యెక్కువగా దాని చర్మం మీద యేమైనా సూక్ష్మజీవులుంటే, అవి ఆ పదార్థంలో చేరవచ్చు. అయినా, వుడుకుతున్నప్పుడు ఆ సూక్ష్మజీవులుకూడా నశిస్తాయి.

కానీ....శాకాహారులకైనా, అలాంటి జంతువులని తినడం అలవాటులేని మాంసాహారులకైనా, సహజంగా వికారం/వెలపరం కలగడం వల్ల వాంతులు రావచ్చు. ఒక్కోసారి, డిహైడ్రేషన్ వల్ల మరణం సంభవించవచ్చు. అదే కప్పలనీ, పాములనీ, మిడతలనీ, చివరికి తీపి పదార్థం మీద పాకుతున్న నల్ల కండ చీమలతో సహా ఆ పదార్థాన్ని నమిలి చప్పరించే చీనా, కొరియా వాళ్ల లాంటివాళ్లకి అదో 'సర్ ప్రైజ్ గిఫ్ట్' లాంటిది......" అని!

యెవరో అన్నారట, ఇది యెవరో కావాలని చేసిందే అని.

శభాష్! వాడేవడో కనిపెట్టండి. వాణ్ని తిరుమల యాత్రచేయించి, శ్రీవారి దర్శనం తరవాత, శేషాద్రి కొండమీదనుంచి లోయలో తోసేసే శిక్ష విధించండి.

(తరవాత జన్మలో బల్లి అయి పుడతాడేమో!)

అందరూ సంతోషిస్తారు.

Saturday, May 21, 2011

కబుర్లు - 47

అవీ, ఇవీ, అన్నీ

యెలక్షన్లయిపోగానే, పెట్రోలు రేటు పెంచేశారు. డీజల్, గ్యాస్ ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తారట. 

అనేకమంది కాలమిష్టులూ, ఆర్థిక నిపుణులూ, నాలాంటివాళ్లూ, ఈ ఆయిల్ కంపెనీలు "రావలసిన లాభాలని రాకపోవడంతో" నష్టాలుగా చూపిస్తున్నాయనీ, ప్రభుత్వ సబ్సిడీ కేవలం వెంట్రుక శాతమేననీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా "లాభాలు" పిండుకోడానికే ఈ "బీదార్పులు" అనీ మొత్తుకొంటున్నారు.మీడియావారెవరైనా వాళ్ల "ఆడిటర్ల"నుంచి సమాచారం సేకరిస్తే, "సత్యం ఆడిటర్ల"కి మించిన కుంభకోణాలు బయటికొస్తాయేమో ప్రయత్నించవచ్చుకదా?!

2జీకి మించిన కుంభకోణం మన విమానయానం లో జరిగిందనీ, మంత్రి ప్రఫుల్ పటేల్ దానికి బాధ్యుడనీ నిప్పురాజుకొంది. నిజానికి నాలాంటివాళ్లు మొత్తుకొంటూనే వున్నాము--మన దేశానికి అన్ని "ప్రైవేటు" విమానయాన సంస్థలూ, వాళ్ల విమానాలనబడే "డబ్బాలూ" అవసరమా అని. 

మన "డొమెస్టిక్" ఇండియన్ ఎయిర్ లైన్స్ నీ, "ఇంటర్నేషనల్" ఎయిరిండియానీ యెందుకు కలిపెయ్యవలసి వచ్చింది? మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి, పైలెట్ల సంఘాలని గుర్తింపు రద్దుచేసి, మీ వుద్యోగాలు తొలగిస్తాం అని బెదిరించి, పిచ్చిపిచ్చి చేష్టలు చేసి, చివరికి వాళ్లకి "దాసోహం" అని, గుర్తింపు పునరుధ్ధరణ నుంచీ వాళ్ల డిమాండ్లు అన్నీ వొప్పుకొని, సమ్మె విరమింపచెయ్యవలసిన అవసరం యెవరికి యెందుకు వచ్చింది? ప్రఫుల్ పాత్ర యేమిటి?

ఎయిర్ పోర్టుల దగ్గరనించీ మన మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకుండా, మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ల, వాటి సిబ్బందీ, నైపుణ్యాలని పెంచుకోకుండా, "జెట్"; "స్పైస్ జెట్"; "కింగ్ ఫిషర్" లాంటి సంస్థలకి యెందుకు అనుమతి ఇచ్చారు?

హెలికాప్టర్ల దగ్గరనించీ నిపుణులైన పైలెట్లు, వారికి కావలసిన సమాచారం యెందుకు అందుబాటులో వుండటం లేదు? ఓ రాజశేఖర రెడ్డి, ఓ దోర్జీ, యెందుకు ప్రమాదాలబారినపడి అశువులు కోల్పోవలసి వచ్చింది? 

1962 లో చైనా యుధ్ధం సమయంలో మనకి రష్యా వారిచ్చిన "మిగ్" "గ్నాట్" విమానాలనే పైలెట్ల శిక్షణకి యెందుకు వుపయోగిస్తున్నారు? అవి "ఈగల్లా" యెందుకు రాలిపోతున్నాయి? పైలెట్లు యెందుకు మరణిస్తున్నారు?

ఓ ప్రక్క "సుఖోయ్"లూ, ఇంకో ప్రక్క "బోయింగ్ 737"లూ ప్రవేశించినా, ఇంకా మన "డబ్బా" విమానాలనే యెందుకు వాడుతున్నారు? అవి తరచూ యెందుకు మొరాయిస్తున్నాయి?

ఇలాంటి ప్రశ్నలకి జవాబులు మన మీడియా వాళ్లే కనుక్కోవాలి.

ప్రఫుల్ పటేల్ ని నిలదీయండి.....కనిమొళి ప్రక్క సెల్ లోనే వాడినీ కూర్చోపెట్టండి!

అప్పుడైనా విమానప్రయాణీకులకి భద్రత వుంటుందేమో.

మన రాష్ట్రంలో రైతన్నలకి కష్టాలు తీరడం లేదు. ఇబ్బడిముబ్బడిగా ధాన్యం పండించినా, గిట్టుబాటు ధరలు చెల్లించేవాళ్లు లేరట. గోనె సంచులు లేవట. యంత్రాలు వాడటంవల్ల, తేమశాతం పెరిగిపోతోందట. 

మళ్లీ ఆ యంత్రాల్లో "సరిగ్గా" 100 గ్రాముల వడ్లు వేస్తేనే సరైన తేమశాతం చూపిస్తాయట. ఇంకొన్ని వడ్లు యెక్కువ వేసినా, తేమశాతం పెరిగిపోతుందట! దిక్కుమాలిన యెలక్ట్రానిక్కూ, డిజిటల్లూ పిశాచాలు మనకెందుకంటారు?

సరే బాగానే వుంది. కానీ, మన ప్రభుత్వాలు, సుప్రీం కోర్టు "పేదలకి వుచితంగా పంచండి" అన్నా, "ఠాట్! వీల్లేదు! యెలకలకీ, పందికొక్కులకీ పెడతాం; ఇంకా ముక్కిపోతే సముద్రంలో పారబోస్తాం" అంటున్నాయి.

మరి మీ దరిద్రగొట్టు నిరసనలేమిట్రాబాబూ! ధాన్యాన్ని "మంటల్లో" పోస్తారా? కృష్ణలో "నిమజ్జనం" చేస్తారా! "ప్రభుత్వా"లకీ మీకూ తేడా యేమి వుంది? అన్నదాత యెపుడూ అన్నదాతే కావాలిగానీ, అన్న "హోత" (హోమం చేసేవాడు) అవకూడదు. బుధ్ధి తెచ్చుకోండి. టమాటాలు కాలనీల్లో, కిలో అర్థరూపాయికి అమ్మారు కొందరు రైతులు. ఇంకా మిగిలితే, పశువులకి మేపారు......అంతేగానీ అగ్నికి ఆహుతి చెయ్యలేదు. వాళ్లని చూసి నేర్వండి.

కోర్టుల పుణ్యమా అని, నిర్బంధ బందులూ, హర్తాళ్లూ తగ్గాయి కానీ, ఇప్పుడు అనవసర "రాస్తా"; "రైల్" రోకోలు! వీటికి అంతం యెప్పుడో?!

మీ శరీరంలో "జీవప్రక్రియ" రెండురోజులో, రెండుగంటలో అఖ్ఖర్లేదు--రెండు నిమిషాలపాటు ఆగిపోతే--సంభవించేదాన్ని "మరణం" అంటారు. 

మరి ప్రజల జీవనాడులైన రాస్తాలనీ, రైళ్లనీ కొన్ని గంటలపాటు "రోకో" చేస్తే, జనజీవనం యెలా అస్థవ్యస్థమౌతుందో, యెన్ని మరణాలూ, జీవప్రక్రియ స్థంభనలూ సంభవిస్తాయో యెవరైనా ఆలోచించారా?

హై, సుప్రీం కోర్టులూ--ఇలాంటి వ్రాతలని "పిల్లులు" (అంటే మాత్రలూ, మార్జాలాలూ కాదు) గా స్వీకరిస్తే యెంతబాగుండును?

సర్వే జనాస్సుఖినో భవంతు!

Wednesday, May 11, 2011

కబుర్లు - 46

అవీ, ఇవీ, అన్నీ

అయోధ్య కేసు లో సుప్రీం కోర్టుకెళతామన్న పార్టీలన్నీ అలాగే వెళ్లాయి. నిన్న విచారణ ప్రారంభమయింది.

న్యాయవాదులందరూ తమ తమ కక్షిదారుల తరఫున "ప్రిలిమినరీ" వాదనలు వినిపించారు అన్ని కేసుల్లాగే. 

కానీ విశేషమేమిటంటే, అత్యున్నత న్యాయస్థానం వారు "అయితే ఆ తీర్పు మీ యెవరికీ నచ్చలేదా?" అని అడిగి, అందరూ "లేదు" అనగానే, "హమ్మయ్య! ఈ వొక్క విషయంలోనైనా మీ మధ్య 'యేకాభిప్రాయం ' వుందన్నమాట" అని జోకారట!

పైగా, "యెవరూ అడగకపోయినా, ఆ స్థలం విభజించాలని అలహాబాదు ధర్మాసనం తీర్పివ్వడమేమిటి?" అంటూ ఆ స్థలం విషయంలోనే కాకుండా, ఆ చుట్టుప్రక్కల ప్రభుత్వం సేకరించిన అరవైనాలుగో యెన్నో యెకరాల విషయం లో కూడా "యథాతథ స్థితి కొనసాగాలని" స్టే మంజూరు చేసిందట--యెవరూ అడగకపోయినా!

యేమైనా అర్థం వుందా?

అందరికీ తీర్పు నచ్చితే, అంత ఖర్చుపెట్టుకొని పై కోర్టుకి యెందుకు వెళతారు? ఒక ముక్కని అంతా తమకే కావాలని దెబ్బలాడుకొంటూంటే, దాని విభజన తప్ప ఇంకేమి పరిష్కారం వుంది? దాని(విభజన)కోసం యెవరు అడుగుతారు? 

యెవరి పట్టు వారిది కాబట్టి "రాజీ" మార్గం గా విభజనే బెస్ట్. ఆ మాత్రం తెలీదా అత్యున్నత న్యాయ స్థానం వారికి?

వాళ్ల వుద్దేశ్యం......వివాదం ఇంకో వందో, వెయ్యో యేళ్లు కొనసాగుతూ, "ప్రభుత్వాలకి" తలనొప్పిగా వుంటేనే, అనేకతరాల "న్యాయ" వుద్యోగులూ, వాదులూ, మూర్తులూ కాలుమీద కాలేసుకొని, తమ తరవాత తరాలకి అనుభవించడానికి సరిపడా సంపాదించచ్చు అనా?

సేకరించిన భూమి సంగతి ప్రభుత్వం చూసుకొంటుంది. దాని సంగతి మీకెందుకు?

ఒక్క విషయం మరిచిపోకండి! కక్షిదారుల సంగతెలా వున్నా, సామాన్య ప్రజలందరూ అలహాబాదు న్యాయస్థానం తీర్పుని హర్షాతిరేకంతో స్వాగతించారనీ, ఒక నిట్టూర్పు విడిచారనీ!

లేకపోతే, యెవరికీ పుట్టగతులుండవు.

నిన్న (10-05-2011) రాత్రి యేదో న్యూస్ ఛానెల్ చూస్తూండగా ఓ వార్త చివరి ముక్క విన్నాను ".....తి తి దే వారు ఆ పథకాన్ని అమలు చెయ్యబోమనీ, ఆ విషయంలో నిర్ణయం జరిగిపోయింది అనీ....." న్యాయ స్థానానికి నివేదించారనీ!

నాకు అనుమానం వచ్చేసింది.....ఇంతలోకే యెవరైనా "కదిలే తివాచీ" మీద "పిల్" వేసేశారా.....అదప్పుడే విచారణకి వచ్చిందా, న్యాయమూర్తులు సో కాల్డ్ "ఆగమ పండిత పక్షపాతులా?"......ఇలా!

నిద్రపోయేలోపు మిగిలిన ఛానెళ్లలో ప్రయత్నించానుగానీ, ఆ ప్రస్తావన లేదు.

ప్రొద్దున పేపర్లో చూద్దును కదా....విషయం ఆదికేశవుడి "అనంద.....అనంత....మయం" పథకమట! 

ఇప్పటివరకూ దాతలు ఇచ్చిన కొన్ని లక్షలో, కోట్లో డబ్బునీ, కొన్ని కిలోల బంగారాన్నీ వాళ్లకే తిరిగి ఇచ్చేస్తామనీ, వాళ్లు వాటిని వేరే పథకాలకి వుపయోగించుకోమంటే అలాగే చేస్తామనీ హామీ యిచ్చారట.

వాళ్ల నిర్ణయం చాలా బాగుంది. కానీ, ఆ పేరుతో ఇంకెంతో దండుకున్న వాళ్ల మాటేమిటి? దానిమీద దర్యాప్తులూ, శిక్షలూ మాటేమిటి?

మన్మోహన్లా వాళ్లపదవులు పోయాయికదా, అదే పెద్ద శిక్ష వాళ్లకి అంటారేమో!

భక్తులు వత్తిడి తేవలసిన అవసరం లేదూ? ఆలోచించండి! 

అన్నట్టు, అజిత్ భరిహోకె అనే పేరు గుర్తుందా? ఇదివరకూ తరచూ వినిపించేది అనేక సంచలన కేసుల్లో....ఓ ప్రత్యేక న్యాయస్థానం న్యాయ మూర్తిగా! నాకు గుర్తు రావడం లేదుగానీ అవన్నీ చాలా ముఖ్యమైన కేసులు.

ఇప్పుడు మళ్లీ ఆయన పేరు వినిపిస్తూంది--ఇంకొన్ని కేసుల్లో--ఢిల్లీ హైకోర్టో, సుప్రీం కోర్టో.....న్యాయమూర్తిగా!   
   

Saturday, May 7, 2011

కబుర్లు - 45

అవీ, ఇవీ, అన్నీ

"సేవ వలన మనకు చేకూరు ఆనంద
మదియె శాంతి సుఖములంది యిచ్చు
శాంతికన్న మిన్న సౌఖ్యంబు లేదయా
ఉన్నమాట తెలుపుచున్న మాట

స్వర్గమనగ వేరు సురలోకమున లేదు
నరుల లోకమందె యమరియుండు
తనదు లోని అహము తా చంపుకొన్న
అది స్వర్గమగును అవనియందు

కష్టసుఖముల నొకరీతి గాంచవలయు
కలిమిలేములు విడదీసి గడువరాదు
కీర్తి అపకీర్తులను నొక మూర్తిగానె
భావమందుంచి మెలగుటే భక్తి పథము"

ఇదేమిటి?

సత్యసాయి ఆశువుగా చెప్పిన కవితలలో ఒకటిగా చెప్పబడుతున్నది. నాకు బాగా నచ్చింది.

"వేకువజాము :

3 గంటలకి దిన చర్య ప్రారంభం. 6 గంటలవరకూ ఓంకార స్మరణ

ఉదయం :

6.00: భక్తుల ఉత్తరాల పరిశీలన, 7.00: అల్పాహారం; 8.00: భక్తులకు ప్రత్యేక దర్శనం; 9.00: భజన కార్యక్రమంలో పాల్గొంటారు; 9.30: విశ్రాంతి. (భోజనం మరి?)

మధ్యాహ్నం :

3.00: భక్తులకి దర్శనం; 3.30: ప్రముఖులతో భేటీ(?!).

సాయంత్రం :

5.00: ప్రశాంతి నిలయంలో నిర్వహించే భజనలో పాల్గొంటారు.

5.30: యజుర్వేద మందిరానికి వెళతారు; 7.00: భోజనం; 7.30: ట్రస్టు వ్యవహారాలను రాత్రి 9 గంటలవరకూ చూస్తారు.

(తర్వాత?! యజుర్వేద మందిరంలో రెండో అంతస్తులో వున్న తన యేసీ శయన మందిరానికి చేరి, వాటర్ బెడ్ పై నిద్రిస్తారు....యేదో సంగీతాన్ని వింటూ!--అని యెక్కడో చదివిన గుర్తు)

ఇదేమిటీ?

సత్యసాయి దినచర్యగా చెప్పబడినది!  

*   *   *

అయ్యప్ప మకర జ్యోతి గుంటకట్టి, గంట వాయించేసింది. అది "కృత్రిమమే" అని దేవస్వోం బోర్డు పెద్ద కోర్టుకి తెలిపింది.

కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు అక్కడ మంటలు వేసేవారనీ, తరవాత అక్కడో తిన్నె నిర్మించి, దానిమీద కొన్ని కేజీల హారతి కర్పూరం వెలిగించడం ద్వారా, దేవస్వోం వారు మకర జ్యోతిని వెలిగిస్తున్నారు అనీ, బోర్డు వారు వొప్పుకున్నారు.

అంతే కాకుండా, "ఆ సమయంలో" ఆకాశంలో 'పొడిచే' నక్షత్రమే 'అసలు మకర జ్యోతి ' అని కూడా వొప్పుకున్నారు.

ఆ సో కాల్డ్ జ్యోతి కోసం వెళుతూనో, తిరిగి వస్తూనో, టాటా సుమోల్లోనో, ప్రత్యేక వాహనాల్లోనో, తొక్కిసలాటల్లోనో, లాఠీ ఛార్జీల్లోనో, గాయపడిన, మరణించిన వాళ్లకి యెవరు జవాబుదారీ?

ఆ బోర్డు వాళ్లకి వేలల్లో యేమైనా విదిల్చిందేమో. కానీ, వాళ్లు దండుకొనే దాన్లో వీళ్లకి ఇచ్చిందెంత శాతం?

*   *   *

దేశంలోనే తొలిసారిగా హైదరాబాదులోని సనత్ నగర్లో ఈఎస్ ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. (ఈ ఎస్ ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్--ప్రభుత్వోద్యోగులకి సెలవు కావలసి వస్తే, మెడికల్ సర్టిఫికెట్లు జారీ చెయ్యడానికి మాత్రమే వుపయోగపడే సంస్థ!) రూ.129.87 కోట్ల నిధులు, 126 పడకల సామర్ధ్యంతో యేర్పాటు చేశారు. (అంటే పడక్కో కోటి పైగా!)

ఇంకా చాలా వార్తుంది......కానీ, ప్రభుత్వ సొమ్ము పడకల పాలేనా?!

మీరే చెప్పాలి.....బిల్డింగుకెంతయ్యిందో, పడకలకీ వగైరాలకీ యెంతయ్యిందో, కావలసిన డాక్టర్లూ, ఎక్విప్ మెంటూ, ఆపరేషన్ థియేటర్లూ, సామాగ్రీ, యేసీలూ గట్రాలు "ఆ కోటిలోకి" వస్తాయో--అవన్నీ ఎక్స్ ట్రాలో--లాంటి ప్రశ్నలకి జవాబులు.
 
   

Thursday, May 5, 2011

కబుర్లు - 44

అవీ, ఇవీ, అన్నీ

నేను ఇదివరకు వ్రాసిన ఓ టపాలో వెలిబుచ్చిన భావాలనే ప్రకటిస్తూ, ఎస్ ఎస్ తారాపోర్ (రిజర్వు బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నరు) ఈనాడులో తన "డిపాజిటర్లతో సయ్యాటలా" అనే శీర్షికతో, 25-04-2011 న ఓ వ్యాసం వ్రాశాడు. చదవకపోతే, ఇప్పుడైనా చదవండి.

ఇంక రిజర్వ్ బ్యాంక్, అత్యంత ధైర్యంతో, ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసే వుద్దేశ్యంతో, రెపో/రివర్స్ రెపో రేట్లని "యేకంగా" (తుమ్మల కిషోర్ "అంచనాలకు" మించి) అర శాతం పెంచేసింది! సీ ఆర్ ఆర్ ని ముట్టుకో లేదు. బాగానే వుంది.

కానీ, "పెట్రో" ధరలు తక్షణమే పెంచాలని సూచించడం యేమిటి? 

ఇన్నాళ్లూ మురళీ దేవరా ఆ రేట్లు పెంచాలని ప్రభుత్వానికి లేఖలు వ్రాయడం, మన్మోహన్, మోంటేక్ లు "ఇప్పుడే వద్దు" అనడం, జైపాల్ రెడ్డి కూడా "సమీప భవిష్యత్తు లో పెరగవు" అని హామీలివ్వడం ఇలా జరుగుతూ వస్తోంది.

ఈ విషయం ఆర్బీఐ కి యేమి సంబంధం? ఇదివరకు యెప్పుడూ అలాంటి సలహాలు వాళ్లివ్వలేదే? దువ్వూరివారే యెందుకు ఇచ్చారు? శంఖంలో నీళ్లు పొయ్యమని ఆయనకి యెవరు చెప్పారు?

అలా పెంచకపోతే, ద్రవ్యలోటు రూ.లక్షా యెనభై వేల కోట్లు పెరిగిపోతుందట! ఇంతాజేసి ఓ 2జీ స్కామంతే కదా?! ఆ డబ్బుని ఆ వెధవల దగ్గర వసూలు చేసి, దాంతో "ఆయిల్ పూల్" యేర్పాటు చెయ్యమని యెందుకు "రికమెండ్" చెయ్యరు దువ్వూరివారు? జనాలు లోకువా!

(ద్రవ్యలోటూ, వృధ్ధిరేటూ ప్రభుత్వ తలనొప్పులు. అవి మీకెందుకు? ఇప్పటికీ ద్రవ్యలోటుకి సరిపడా కొత్త కరెన్సీ ప్రింటు చేసి విడుదల చేస్తూనే వున్నారుగా? ఇంకా "డీ మోనెటైజేషన్" కి సంకేతాలు ఇచ్చినట్టు కాదూ?)

(డీ మోనెటైజేషన్ గురించి మరో టపా వ్రాస్తాను త్వరలో).

క్రితంసారి పెంచిన ధరలకే మన చికెన్నారాయణా, నిత్యసంతోషి రాఘవులూ, కిషన్ రెడ్డీ, చంద్రబాబూ అడపాదడపా ఆందోళనలు చేసి, అంతకన్నా "ముఖ్యమైన" విషయాల్లోకి వెళ్లిపోయారు. మరి ఇవాళో రేపో అర్థరాత్రి నుంచీ ఈ రేట్లు "విపరీతంగా" పెరిగితే, అందోళనలు చెయ్యడానికి వీరికి వోపిక వుంటుందా? యేమో!

ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రజలు వీఐపీలు కాదు--వీపీలు (వట్టి పిచ్చాళ్లు!).

మన రాజశేఖర రెడ్డి బాటలోనే, అరుణాచల్ ముఖ్యమంత్రి ఖండు దోర్జీ (ఇదివరకు పత్రికలు ఆయన పేరుని "ఖాండుప్ దోర్జీ" అని వ్రాశేవారనుకుంటా) పైలోకాలకి వెళ్లిపోయిన కొన్ని రోజుల తరవాత ఆ వార్తని ధృవీకరించాయి ప్రభుత్వాలు.

మన చిరంజీవి సైతం నిన్న (04-05-2011) న తను ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ తో సహా దాదాపు ఓ గంటపాటు "మాయం" అయిపోయాడట బెం"గాల్లో"!

బాబూ! బ్రతికుంటే బలుసాకు తినొచ్చు. ఇదివరకోసారి పొలాల్లో దిగిపోయావు అని మరచిపోతే యెలా?

నువ్వు పొత్తు కలుపుకొన్న కి.కు.రె. హెలికాప్టర్లే కాదు, విమానాలు కూడా యెక్కడానికి భయపడుతుంటే, తగుదునమ్మా అని ఇలా చెయ్యడం మనకి అంత "అవసరమా?" అహ.....అవసరమా అని?

బీహార్ తరహా చట్టాలు తేవాలి అంటున్నాడు అసదుద్దీన్--హింసకి వ్యతిరేకంగా! తనదాకా వస్తే.......అని అక్బరుద్దీన్ చెప్పాడు మరి!

Monday, May 2, 2011

కబుర్లు - 43

అవీ, ఇవీ, అన్నీ

ఇదివరకోసారి సణిగాననుకుంటా--పోస్టల్ వాళ్లు ఇచ్చే "నివాస ధృవీకరణ" కార్డుల గురించి.

ఇవి క్రితం నెలలోనే అందుబాటులోకి వచ్చేశాయట. రూ.225/- చెల్లించి, సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేస్తే, 10-15 రోజుల్లో ఈ కార్డు ఇచ్చేస్తారట. 3 సంవత్సరాల తరవాత దాన్ని రెన్యువల్ చేయించుకోవాలట. (ఈలోపల చిరునామా మారితే, కొత్త కార్డు తీసుకోవాలని చెప్పఖ్ఖర్లేదు కదా).

ఈ కార్డులు బ్యాంకుల్లోనూ, పోస్టాఫీసుల్లోనూ ఖాతాలు తెరవడానికీ, డ్రైవింగ్ లైసెన్సులు పొందడానికి, విదేశాలకి వెళ్లే సందర్భంలో పాస్ పోర్ట్ పొందడానికి, దూర ప్రాంతాలకీ, తీర్థయాత్రలకీ వెళ్లే వ్యక్తుల ఆచూకీ తెలుసుకోడానికీ--ఇలా అనేకవిధాలుగా వుపయోగిస్తాయట.

మొన్న అన్నాహజారే అహింసామార్గంలో లక్ష్యసిధ్ధి జరగకపోతే, శివాజీ మార్గం అవలంబించ వలసి వస్తుంది అన్నందుకూ, అంతకన్నా యెక్కువగా నరేంద్ర మోడీ బాగా పాలిస్తున్నాడు అన్నందుకూ అనేక విధాలుగా వాపోయినవాళ్లలో ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూడా వున్నాడు.

ఆయన చెప్పిన వాటిలో "పి చిదంబరం, కపిల్ సిబల్ మరీ అతిగా వ్యవహరిస్తున్నారు. వారి దూకుడుకు ప్రథానమంత్రి ముకుతాడు వేయాలి" అనడం నాకు నచ్చింది.

కానీ, రాజ్యాంగబధ్ధంగా యేర్పడిన "పీ యే సీ" లో సభ్యులు తిరగబడేలా చేసింది మన్మోహనా? సోనియానా? లేక ఇంకెవరైనా తమిళ కోటరీవాళ్లా?

వాళ్లని సమర్థిస్తూ టీవీలకెక్కుతున్న వుండవల్లి అరుణకుమార్లవి నాలుకలా తాటిపట్టెలా?

ఇలాంటివాళ్లకి బుధ్ధి చెప్పడానికి శివాజీ మార్గమైనా సరిపోతుందా?

ఇవన్నీ శేష ప్రశ్నలు.

ఈనాడు వారు "ఒడుదొడుకులు" అని వ్రాస్తున్నారు. నేననుకునేది అది "ఒడిదుడుకులు" అని. తల్లి వొడిలోని పసివాడు దుడుకుగా క్రిందకి జారడానికి ప్రయత్నించడం ఆ తల్లికి ఒడిదుడుకు కాబట్టి. మన తెలుగు బ్లాగర్లేమంటారో?

ఆమధ్య, "కుదుపుల్లేని" దురంతో రైలు పెట్టెలొస్తున్నాయన్నారు. స్వీడన్ నించి దిగుమతి చేసుకున్న "టైట్ లాక్ కపులర్ల"తో అనుసంధానించే పెట్టెలతో ఆ రైలు నడుస్తుందన్నారు. ఆ రైలు ముంబాయి, సికింద్రాబాద్ ల మధ్య నడుపుతారని కూడా అన్నారు.

మరి ఆ దురంతోలు యేమయ్యాయో?

ఆత్మ.....

.....శాంతి



ఒసామా బిన్ లాడెన్ "చచ్చాట్ట"!

తెలుగు బ్లాగర్లూ......"మిష్టర్! షో రెస్పెక్ట్ టు ది డిపార్టెడ్ సోల్!" అంటారా?

"మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్" అంటారా?

నేనుమాత్రం వాడి ఆత్మ పాతాళం కన్నా క్రింద ఇంకో లోకమేదైనా వుంటే దాంట్లో శాశ్వతంగా పడివుండి, రౌరవాది నరకాలూ శాశ్వతంగా అనుభవిస్తూ వుండాలి అని కోరుకొంటాను.


నా బ్లాగుమాత్రం శాశ్వతం! (నేనున్నంతవరకూ!)

వాకే???!!!