అవీ, ఇవీ, అన్నీ
(వీటిలో కొన్ని పాతవి......అంటే ఇదివరకే వ్రాసి, ప్రచురించకుండా వున్నవి)
చందమామ వెన్నెలలు కురిపిస్తూ వుంటే......రకరకాల పరవశాలు. పూర్తి వెలుగూ కాదు, చీకటీ కాదు. కొన్ని స్పష్టంగా కనబడతాయి, కొన్ని స్పష్టంగా కనబడవు.
అలా కాకుండా, పగలంత వుండే వేడి లేకుండా, వెలుగు ఇంకా యెక్కువ వుంటే యెంత బాగుంటుంది? అన్నది ఓ తుంటరి ఆలోచన.
ఆ ఆలోచన కి కార్య రూపం యెలా? అంటే, చంద్రుడి మీద సూర్య కాంతి పడే ప్రదేశాన్ని అంతటినీ నున్నగా, అద్దం లా చెక్కేస్తే?...... అంతా అఖ్ఖ్రరలేదు, ఓ ఎనిమిదో వంతు చాలు అంటే?.......అవును కదూ!
ఇప్పుడు అలాంటి ఆలోచనే చేస్తున్నారట స్వీడన్ లోని ఫోరియో అనే సౌందర్య సాధనాల సంస్థ వారు. ఆ పరిశోధన కోసం 5.2 కోట్ల డాలర్లను సమకూర్చుకున్నారట కూడా. అలా చెయ్యడం వల్ల రాత్రివేళ వీధి దీపాలూ వగైరాల ఖర్చులు మిగిలి, పర్యావరణానికి కూడా మంచిది అని వాదిస్తున్నారట.
ప్రకృతివాదులేమో, "అలాచేస్తే ఇంకేమైనా వుందా? ప్రకృతి సమతౌల్యత దెబ్బతిని, విపరీత పరిణామాలకి దారి తియ్యదూ" అంటున్నారట.
నవరాత్రులూ గడిచి, అన్నిచోట్లా నిమజ్జనాలుకూడా పూర్తయ్యాక, మా పాలకొల్లు లో 52 అడుగుల భారీ మట్టి వినాయకుణ్ని--నాలుగు ట్రాక్టర్ల బంకమట్టీ, టన్ను ఇనుమూ, మూడు టన్నుల సరివీ కర్రలూ, 5 టన్నుల కొబ్బరి పీచూ, ఓ ట్రాక్టర్ యెండుగడ్డీ, 20 బొండల డొక్క తాడూ--తో తయారైన దాన్ని, తరలించడం కష్ట సాధ్యం అని తర్జన భర్జన పడి, 23 రోజుల తరవాత నిమజ్జనం చేశారు. యెలా అనుకున్నారు?
ప్రక్కనున్న ప్రథాన సాగునీటికాలువ నుంచి ఇంజన్ల ద్వారా నీళ్లు తోడి, వేగంగా విగ్రహమ్మీద జిమ్ముతూ, 30 మంది యువకులు, మట్టిని యెక్కీ, తొక్కీ తొలగిస్తూ, ఆ మట్టిని కాలవలోకలుపుతూ, భారీ విద్యుత్ దీపాలు యేర్పాటు చేసి మరీ మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకూ కొనసాగించారట! (మరి ఇనుమూ, కర్రలూ అవీ యేమి చేశారో తెలీదు.)
యేమైతే యేం? ఇదోరకం నిమజ్జనం!
మొన్న దసరాలకి దుర్గాదేవి విగ్రహాలని కూడా నిమజ్జనం చేశారు కొన్ని చోట్ల!
మొన్న ఓ మిత్రుడు అన్నట్టు, మన సంస్కృతీ, సంప్రదాయం అంటూ, మీరూ నేనూ హరిదాసుల వేషాలూ, గంగిరెద్దుల వాళ్ల వేషాలూ వేసీ, కార్యాలయాల మొజాయిక్ నేలలమీద పేడతో అలికేసి, ముగ్గులు పెట్టెయ్యడం యేమిటో? బహుశా వీటినే అంటారేమో....వెర్రి తలలు వేయడం అని!
అన్నట్టు, దసరా అంటే ముఖ్యంగా జరిగేవి యేనుగు సంబరాలు.....జమ్మి కొట్టడం! ఇప్పటి వాళ్లకి ఇవేమైనా తెలుస్తున్నాయా? మా వూళ్లో కొన్నేళ్ల క్రితం వరకూ 3 యేనుగులు బయలుదేరేవి.....ఒకటి రెవెన్యూ ఉద్యోగులదీ, ఒకటి కోర్టు వారిదీ, ఇంకొకటి మునిసిపల్ ఉద్యోగులదీ. కొన్నేళ్లుగా రెండు యేనుగులు లోపిస్తూ, ఇప్పుడు మునిసిపాలిటీ వారిది మాత్రం ఒక్కటీ ఊరేగుతోంది.
అలాగే, అట్లతద్ది అంటే, మాలలు గొంతెమ్మ పండగ ఘనంగా నిర్వహించి, అనేక పేటలనుంచీ "మందిరాల" లో ఊరేగిస్తూ, గోదావరిలో నిమజ్జనం చేసేవారు! ఇప్పుడెక్కడ ఆ సంప్రదాయాలు?
ఇంక, మన బుర్రోవాదుల (బ్యూరోక్రాట్ల) "ఆథార్" పిచ్చి కూడా వెర్రితలలు వేస్తోంది. "అనర్హుల"ని తొలగించడం వల్ల కొన్ని కోట్లు మిగిలిపోతాయంటూ, యెవరో అన్నట్టు--పాతవాళ్లని తొలగిస్తూ, కొత్త "అనర్హుల"ని చేరుస్తూ--యెన్ని వేషాలు వెయ్యాలో అన్నీ వేస్తున్నారు!
అల్లప్పుడేమో, ముసలివాళ్లకి ఐరిస్ లు సరిగ్గా రావడం లేదు అంటే, లేదా వేలి ముద్రలు సరిగ్గా రావడం లేదు అంటే, అవిలేకుండా వివరాల నిక్షిప్తం ముందుకు జరగదు కాబట్టి, అక్కడి రెవెన్యూ ఉద్యోగుల ఐరిస్ లూ, వేలి ముద్రలూ వేసెయ్యమన్నారు! ఇప్పుడేమో, అవన్నీ "చెల్లవు" అంటున్నారు! వేలి ముద్రలు "అరిగిపోయాయి" అంటున్నారు!
ఇంకా, జనం అందరూ ఫలానా చోటుకి వచ్చి, పరిశీలన చేయించుకోకుంటే, రద్దు చేస్తామంటున్నారుట. యెండల్లో, వానల్లో వృధ్ధులూ, వికలాంగులూ పడుతున్న అవస్థలు పగవాడికి కూడా వద్దు అనిపిస్తున్నాయి.
మళ్లీ తట్టెడు ధృవీకరణ పత్రాలూ, అవీ దాఖలు చేయమనడం తో జెరాక్స్ షాపుల వాళ్లు లక్షల్లో సంపాదించుకుంటున్నారు! (ఆథార్ కార్డ్ అంటే, క్రింద వుండే చిన్న ముక్క ని కత్తిరించుకుంటే సరిపోతుంది. కానీ, మొత్తం కార్డుని పెద్దకాయితం మీద తీయించేస్తున్నారు....యెందుకైనా మంచిది అని. అలాగే మిగతా కార్దులూ, పట్టాదారు పాస్ బుక్కులూ వగైరాలు. మరి "పేపర్ లెస్" వ్యవస్థ యెప్పటికి వస్తుందో?)